Kakarakaya Nuvvula Karam Fry : కాకరకాయలు చేదుగా ఉన్నప్పటికి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కాకరకాయతో మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కాకరకాయలతో మనం ఎక్కువగా ఫ్రైను తయారు చేస్తూ ఉంటాం. కాకరకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుందన్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఫ్రైను నువ్వుల కారం వేసి మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. నువ్వుల కారం వేసి చేసే కాకరకాయ ఫ్రై చాలా రుచిగా ఉండడంతో పాటు దీనిని తయారు చేయడం కూడా సులభం. ఎంతో రుచిగా ఉండే కాకరకాయ నువ్వుల కారం ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ నువ్వుల కారం ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్న ముక్కలుగా తరిగిన కాకరకాయలు – పావు కిలో, తరిగిన ఉల్లిపాయలు – 2, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, కరివేపాకు – ఒక రెమ్మ.
నువ్వుల కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండుమిర్చి – 5, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
కాకరకాయ నువ్వుల కారం ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. తరువాత కారం తయారీకి కావల్సిన మిగిలిన పదార్థాలు వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై దోరగా వేయించి జార్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కాకరకాయ ముక్కలు, కరివేపాకు వేసి కలపాలి. తరువాత పసుపు, ఉప్పు వేసి కలపాలి.
ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కాకరకాయ ముక్కలను వేయించాలి. కాకరకాయ ముక్కలు వేగిన తరువాత మూత తీసి మరో 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పొడి వేసి మరో రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాకరకాయ నువ్వుల కారం తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయతో తరచూ చేసే ఫ్రైతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు. కాకరకాయను తినని వారు కూడా ఈ ఫ్రైను ఇష్టంగా తింటారు.