Kakarakaya Vepudu Recipe : చేదు లేకుండా కాక‌ర‌కాయ వేపుడును ఇలా చేయ‌వ‌చ్చు.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..

Kakarakaya Vepudu Recipe : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో కాక‌ర‌కాయ‌లు కూడా ఒక‌టి. చేదుగా ఉంటాయ‌న్న కార‌ణం చేత వీటిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ కాక‌ర‌కాయ‌ల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని వీటిని త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది కాక‌ర‌కాయ‌ల‌తో వేపుడును త‌యారు చేస్తూ ఉంటారు. కాక‌ర‌కాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చేదు లేకుండా రుచిగా కాక‌రకాయ ఫ్రై ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కాక‌రకాయ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కాక‌ర‌కాయ‌లు – 500 గ్రా., ఎండుకొబ్బ‌రి ముక్క‌లు – 6, పుట్నాల ప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, కారం – 2 టీ స్పూన్స్ లేదా త‌గినంత‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 7, నూనె – 6 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్.

Kakarakaya Vepudu Recipe in telugu everybody likes it
Kakarakaya Vepudu Recipe

కాక‌రకాయ ఫ్రై తయారీ విధానం..

ముందుగా కాక‌ర‌కాయ‌ల‌పై ఉండే చెక్కును తీసివేయాలి. త‌రువాత వీటిని శుభ్రంగా క‌డిగి గుండ్ర‌ని ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత ఒక జార్ లో ఎండు కొబ్బ‌రి ముక్క‌లు, పుట్నాల ప‌ప్పు, కారం వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌ల‌ను వేసి క‌చ్చాప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన త‌రువాత కాక‌రకాయ ముక్క‌ల‌ను వేసి మ‌ధ్య‌స్థ మంట‌పై క‌లుపుతూ వేయించుకోవాలి. వీటిని ఒక‌సారి వేయించుకోవ‌డం రాసి వారు రెండు భాగాలుగా చేసి వేయించుకోవాలి. కాక‌రకాయ ముక్క‌ల‌ను పూర్తిగా వేయించుకున్న త‌రువాత వాటిలో ఉప్పు, ప‌సుపు వేసి క‌లుపుకోవాలి. వీటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న కారాన్ని వేసి క‌లపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చేదు లేని కాక‌ర‌కాయ ఫ్రై త‌యార‌వుతుంది. వేడి వేడి అన్నంతో క‌లిపి తింటే ఈ కాక‌ర‌కాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts