Kallu Adaradam : మనలో చాలా మంది కళ్లు అదరడాన్ని ఎదుర్కునే ఉంటారు. ఒకసారి కుడి కన్ను, ఒక సారి ఎడమ కన్ను అదురుతుంది. అయితే స్త్రీలకు ఎడమ కన్ను, పురుషులకు కుడి కన్ను అదరడం వల్ల మంచి జరుగుతుందని మనలో చాలా మంది భావిస్తారు. అసలు ఇది ఎంత వరకు నిజం అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనక వాస్తు శాస్త్రం లాగానే శకున శాస్త్రం కూడా ఉంటుంది. ఈ శకున శాస్త్రం ప్రకారం కళ్లతోపాటు స్త్రీలకు శరీరంలో ఎడమ భాగం, పురుషులకు శరీరంలో కుడి భాగం అదిరితే మంచిదట. దీని వెనుక ఒక కథ కూడా ఉంది.
శ్రీ రాముడు రావణాసురుడిపై యుద్దానికి దిగినప్పుడు ఆ సమయంలో లంకలో ఉన్న సీతా మాతకు, రావణాసురుడికి ఒకేసారి ఎడమ కన్ను అదిరిందట. మంచి జరగబోతుందని సీతా మాతకు, చెడు జరగబోతోందని రావణాసురుడుకి కన్ను అదరడం ద్వారా ముందే తెలిసిందట. ఆ సమయంలో ఎడమ కన్ను అదరడం వల్ల రావణాసురుడికి కీడు జరిగింది. కనుక పురుషులకు ఎడమ కన్ను అదిరితే కీడు జరుగుతుందని ఆ నాటి నుండి వాడుకలో ఉంది. ప్రాచీన కాలం నుండి కొన్ని నమ్మకాలు మంచిని పెంచాయి. కొన్ని శాస్త్రపరంగా నిరూపితం కానివి ఉన్నాయి. ఇలా నిరూపితం కానివే మూఢ నమ్మకాలు. మనం బయటికి వెళ్లేటప్పుడు ఎవరైనా తుమ్మితే కూర్చుని వెళ్లమంటారు. కొందరు కాకి తల మీద తన్నితే వాళ్లకు శని పడుతుంది అని అంటారు. ఇలాంటి మూఢ నమ్మకాలను మన దేశంలోని ప్రజలతోపాటు ఇతర దేశాలలో ప్రజలు కూడా నమ్ముతారు. ఇలాంటి వాటిని నమ్మేవారు ఉంటారు. ఇవి అన్నీ మూఢ నమ్మకాలని కొట్టిపారేసే వారు ఉంటారు.
ఇలా కన్ను అదిరిన ప్రతిసారీ మంచి జరుగుతుంది, చెడు జరుగుతుందని కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. కొన్ని సందర్భాలలో మాత్రమే కన్ను అదరడం శకునంగా మారుతుంది. అసలు మన శరీర భాగాలు అదరడానికి చాలా కారణాలు ఉంటాయి. కొందరిలో ఒక రోజంతా కూడా శరీర భాగం అదురుతూనే ఉంటుంది. కొందరిలో కొద్ది సమయం మాత్రమే అదురుతుంది. ఇలా శరీర భాగాలు అదరడానికి నరాల బలహీనత కూడా కారణం కావచ్చు.
శరీరంలో ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు కూడా శరీర భాగాలు అదురుతాయి. కంటి సమస్యలు ఉండడం వల్ల కూడా కొన్నిసార్లు కళ్లు అదురుతాయి. ఇలా శరీర భాగాలు తరచూ లేదా చాలా సేపటి వరకు అదురుతూ ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. కన్ను అదురుతుంది కనుక మనకు మంచే జరుగుతుందని.. దానిని మూఢ నమ్మకంగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. కన్ను అదరడం వల్ల మంచి జరగవచ్చు.. జరగకపోవచ్చు.. కనుక దీనిని నమ్మడం నమ్మకపోవడం మన మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఎక్కువ సమయం పాటు అదిరితే మాత్రం తప్పక వైద్యులను సంప్రదించాలి. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే అలాగే అదురుతుంది కనుక.. డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఇలా కళ్లు లేదా శరీర భాగాలు అదిరినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.