Katte Pongali : కట్టె పొంగలి.. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. కట్టె పొంగలి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసి అమ్మవారికి నైవేధ్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఆలయాల్లో ప్రసాదంగా కూడాకట్టె పొంగలిని పెడతారు. ఈ కట్టె పొంగలిని తయారు చేయడం చాలా సులభం. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. రుచిగా, సలుభంగా కట్టె పొంగలిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కట్టె పొంగలి తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, పెసర పప్పు – ముప్పావు కప్పు, నీళ్లు – 6 కప్పులు, ఉప్పు – తగినంత, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 4 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 4, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు పలుకులు – పావు కప్పు, జీలకర్ర – 2 టీ స్పూన్స్, మిరియాలు – ఒకటిన్నర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, ఎండుమిర్చి – 1, ఇంగువ – పావు టీ స్పూన్.
కట్టె పొంగలి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యం, పెసరపప్పు వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత నానబెట్టుకున్న పెసరపప్పు, బియ్యం వేయాలి. ఇందులోనే తగినంత ఉప్పును వేసి మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. బియ్యం, పెసరపప్పు దగ్గరిగా మెత్తగా ఉడికిన తరువాత అందులో నెయ్యి వేసి పప్పు గుత్తితో లేద గంటెతో మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తరువాత దీనిని చిన్న మంటపై ఉడికిస్తూ ఉండాలి. పొంగలి ఉడుకుతుండగానే మరో స్టవ్ మీద కళాయిని ఉంచి అందులో నెయ్యి వేయాలి.
నెయ్యి కాగిన తరువాత తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత దానిని ఉడికిస్తున్న పొంగలిలో వేసి కలపాలి. దీనిపై మూతను ఉంచి మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చక్కటి వాసనతో ఎంతో రుచిగా ఉండే కట్టె పొంగలి తయారవుతుంది. ఇది చల్లారే కొద్ది గట్టిగా తయారవుతుంది. కనుక పొంగలి కొద్దిగా పలుచగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేయాలి. దీనిని ఉదయం అల్పాహారంగా చేసుకుని తినవచ్చు. ఈ కట్టె పొంగలిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.