Korrala Pongali : మనం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాలల్లో కొర్రలు కూడా ఒకటి. కొర్రలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బరువు తగ్గడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలో ఇలా అనేక రకాలుగా కొర్రలు మనకు దోహదపడతాయి. కొర్రలతో అన్నాన్ని వండుకుని తింటూ ఉంటారు. కేవలం అన్నం మాత్రమే కాకుండా కింద చెప్పిన విధంగా కిచిడీని కూడా తయారు చేసుకుని తినవచ్చు. కొర్రలతో చేసే ఈ కిచిడీ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ కిచిడినీ తయారు చేయడం చాలా సులభం. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ కొర్రల పొంగలిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొర్రల పొంగలి తయారీకి కావల్సిన పదార్థాలు..
రాత్రంతా నానబెట్టిన కొర్రలు – ఒక కప్పు, పెసరపప్పు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, నీళ్లు – 4 కప్పులు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, జీడిపప్పు – గుప్పెడు, తరిగిన పచ్చిమిర్చి – 3, తరిగిన అల్లం – ఒక ఇంచు ముక్క, కరివేపాకు – 2 రెమ్మలు, ఇంగువ – రెండు చిటికెలు.
కొర్రల పొంగలి తయారీ విధానం..
ముందుగా కళాయిలో పెసరపప్పు వేసి చిన్న మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత వీటిని శుభ్రంగా కడిగి కుక్కర్ లోకి తీసుకోవాలి. ఇందులోనే రాత్రంతా నానబెట్టిన కొర్రలను వేసి కలపాలి. తరువాత ఉప్పు, నీళ్లు పోసి మూతపెట్టాలి. వీటిని 5 విజిల్స్ వచ్చే వరకు మధ్యస్థ మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ఆవిరి పోయిన తరువాత మూత తీసి అంతా కలిసేలా కలుపుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు తాళింపుకు కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని పొంగలిలో వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొర్రల పొంగలి తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ వ్యాధితో బాధపడే వారు ఇలా కొర్రలతో పొంగలిని తయారు చేసి తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.