Avakaya Pulihora : ఆవకాయ పులిహోర.. ఈ పేరు వినగానే అందరికి మామిడికాయలతో చేసే పులిహోరనే గుర్తుకు వస్తుంది. కానీ మామిడికాయ నిల్వ పచ్చడితో కూడా మనం ఎంతో రుచిగా ఉండే పులిహోరను తయారు చేసుకోవచ్చు. ఈ పులిహోర లంచ్ బాక్స్ లోకి కూడా చాలా చక్కగాఉంటుంది. ఇంట్లో మామిడికాయ పచ్చడి ఉంటే చాలు దీనిని 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా పులిహోరను తయారు చేసుకుని తింటే కడుపు నిండా తింటారని చెప్పవచ్చు. ఎంతో కమ్మగా ఉండే ఈ ఆవకాయ పులిహోరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవకాయ పులిహోర తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – పావు కప్పు, ఆవాలు – ఒక టేబుల్ స్పూన్, పల్లీలు – 3 టేబుల్ స్పూన్స్, పొట్టు మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, కరివేపాకు – రెండు రెమ్మలు, ఎండుమిర్చి – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, ఇంగువ – రెండుచిటికెలు, తరిగిన టమాటాలు – 2, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – గుప్పెడు, ఉప్పు – కొద్దిగా, ఆవకాయ పచ్చడి – అర కప్పు, అన్నం – పావుకిలో బియ్యంతో వండినంత, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్.
ఆవకాయ పులిహోర తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, పల్లీలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఇంగువ వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత టమాట ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత పసుపు, ఉప్పు, కొత్తిమీర వేసి కలపాలి. తరువాత ఆవకాయ పచ్చడి వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత అన్నం వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత చివరగా నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆవకాయ పులిహోర తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా అప్పటికప్పుడు మామిడికాయ పులిహోరను తయారు చేసుకుని కడుపు నిండా తినవచ్చు.