Kothimeera Pachadi : కొత్తిమీర.. ఇది తెలియని వారుండరు. మనం ఎక్కువగా వంటలను గార్నిష్ చేయడానికి వాడుతూ ఉంటాము. వంటల్లో కొత్తిమీరను వాడడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. కొత్తిమీరను వాడడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తహీనత తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ కొత్తిమీరను వంట్లలో వాడడంతో పాటు దీనితో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని తయారు చేసుకోవచ్చు. కొత్తిమీర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు అల్పాహారాలతో తినడానికి కూడా ఈ పచ్చడి చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఈ పచ్చడిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కొత్తిమీర పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు -ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 7 లేదా కారానికి తగినన్ని, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 6, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర – పెద్ద కట్ట ఒకటి, చింతపండు – చిన్న నిమ్మకాయంత, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె -ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు -ఒక రెమ్మ.
కొత్తిమీర పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. వీటిని మాడిపోకుండా చక్కగా వేయించిన తరువాత నువ్వులు వేసి కలపాలి. నువ్వులు చిటపటలాడిన తరువాత కొత్తిమీర, చింతపండు వేసి కలపాలి. ఈ కొత్తిమీరను పూర్తిగా వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత కొత్తిమీరతో పాటు మిగిలిన దినుసులను కూడా జార్ లోకి తీసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత తగినన్ని నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన కొత్తిమీర పచ్చడిని అందరూ లొట్టలేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు.