Roasted Cauliflower Curry : క్యాలీప్లవర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికి తెలిసిందే. క్యాలీప్లవర్ ను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. క్యాలీప్లవర్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. క్యాలీ ప్లవర్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రోస్టెడ్ క్యాలీప్లవర్ కర్రీ కూడా ఒకటి. తరచూ చేసే పద్దతుల్లో కాకుండా ఈ కర్రీని పూర్తిగా భిన్నంగా తయారు చేస్తారు. వేగన్ ఫుడ్ తీసుకునే వారు ఈ విధంగా క్యాలీప్లవర్ కర్రీని తయారు చేసుకుని తినవచ్చు. రోస్టెడ్ క్యాలీప్లవర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రోస్టెడ్ క్యాలీప్లవర్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యాలీప్లవర్ – 1, తరిగిన ఉల్లిపాయ – పెద్దది ఒకటి, తరిగిన టమాటాలు – 2, కారం – ఒకటిన్నర టీ స్పూన్స్, ధనియల పొడి – అర టీ స్పూన్, ఉప్పు -తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కొబ్బరి పాలు – ఒక కప్పు, నానబెట్టిన జీడిపప్పు – గుప్పెడు.
రోస్టెడ్ క్యాలీప్లవర్ కర్రీ తయారీ విధానం..
ముందుగా క్యాలీప్లవర్ ఆకులను, కాడలను తొలగించాలి. తరువాత పురుగులు, మలినాలు లేకుండా చూసుకుని పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో నీటిని తీసుకుని అందులో పసుపు వేసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక క్యాలీప్లవర్ ను వేసి మూత పెట్టి 4 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత క్యాలీప్లవర్ ను మరో వైపుకు తిప్పుకుని మరో 4 నిమిషాల పాటు ఉడికించి పక్కకు తీసుకోవాలి. తరువాత కళాయిలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
ఇవి కొద్దిగా వేగిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత ఒక జార్ లో కొబ్బరి పాలు, జీడిపప్పు, వేయించిన ఉల్లిపాయ, టమాట ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒవెన్ ట్రేను తీసుకుని దానికి నూనెను రాయాలి. తరువాత ఇందులో ఉడికించిన క్యాలీప్లవర్ ను ఉంచి దానిపై అంతటా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ను పోయాలి. తరువాత మిగిలిన పేస్ట్ ను ట్రేలో పోసి ట్రేను ఒవెన్ లో ఉంచాలి.
దీనిని 200 డిగ్రీల వద్ద 30 నిమిషాల పాటు బేక్ చేసిన తరువాత బయటకు తీసి మరో వైపుకు తిప్పుకుని మరో 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ చేసుకున్న తరువాత బయటకు తీసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రోస్టెడ్ క్యాలీప్లవర్ కర్రీ తయారవుతుంది. ఈకర్రీ తయారీలో క్యాలీప్లవర్ ను పెద్ద పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు క్యాలీప్లవర్ వల్ల కలిగే ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇంట్లో పార్టీస్ ఉన్నప్పుడు ఇలా క్యాలీప్లవర్ తో వెరైటీగా కర్రీని తయారు చేసి సర్వ్ చేసుకోవచ్చు.