Krishnam Raju Assets : కృష్ణం రాజు రెబల్ స్టార్‌గా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. దాదాపుగా 60 ఏళ్ళకి పైగా సినీ కెరీర్ కొనసాగగా.. ఆయన ఎన్నో హిట్ చిత్రాలను అందించారు. రెబల్ స్టార్‌గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాల్లో నటించారు. రౌద్ర రసం, కరుణ రసం పండించడంలో ఆయనకి ఆయనే సాటి అని చెప్పవచ్చు.
కృష్ణం రాజు 1940 జనవరి 20న మొగల్తూరులో ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజు, లక్ష్మీ దేవి దంపతులకు జన్మించారు. వీరిది మొదటి నుంచి ధనిక కుటుంబమే. రాజ వంశానికి చెందినవారు. ఇక కృష్ణం రాజుకి వారసత్వంగా మొగల్తూరులో వందల ఎకరాల భూమి ఉందట. అలాగే మొగల్తూరులో ఒక భవనం, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో మొత్తం నాలుగు ఖరీదైన ఇల్లు ఉన్నాయట.
ఇక కృష్ణం రాజుకు జూబ్లీహిల్స్ లో ఇల్లు ఉంది. ఆ ఇంటి ఖరీదు రూ.18 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు హైదరాబాద్ లో కృష్ణం రాజుకి ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. ఇక గోపీకృష్ణ అనే నిర్మాణ సంస్థని కూడా కృష్ణం రాజు స్థాపించారు. కృష్ణం రాజు రూ.90 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ కారు, రూ.40 లక్షలు విలువైన టొయోటా ఫార్చునర్ కారు, రూ.90 లక్షల విలువైన వోల్వో ఎక్స్‌సి లాంటి కార్లను వాడేవారు. అలాగే కృష్ణం రాజుది రాజుల కుటుంబం కాబట్టి వారి ఇంట్లో ఎప్పుడూ విందులు, పార్టీలు గ్రాండ్ గా జరుగుతూనే ఉంటాయి.
కృష్ణం రాజు లేదా ప్రభాస్ ఎవరైనా సరే.. తమ ఇంటికి అతిథులు ఎవరు వచ్చినా.. నోరూరించే వంటకాలతో విందు భోజనం పెట్టిస్తారు. అందువల్లనే వారి విందుకు చాలా మంది ఫిదా అవుతుంటారు. ఇక ప్రభాస్ కూడా కృష్ణం రాజు లాగే షూటింగ్ సమయాల్లోనూ అందరికీ ఇంటి నుంచి వండిన విందు భోజనాన్ని తెప్పించి వడ్డిస్తుంటారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటీనటులు కూడా ప్రభాస్ ఆతిథ్యానికి పడిపోయారు. ఇక ప్రభాస్ ఆస్తి విలువ రూ.1000 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు ప్రభాస్ పెదనాన్ననే మించిపోయేలా సంపాదిస్తున్నాడు. కృష్ణం రాజుకి మొత్తం ముగ్గురు కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి ఉన్నారు. కుమారులు లేరు. అందువల్ల ప్రభాస్ ఆయన అంత్యక్రియలను దగ్గరుండి చేశారు. ప్రస్తుతం కృష్ణం రాజు కుటుంబాన్ని కూడా ప్రభాసే చూసుకుంటున్నారు.