Lemon Pepper Fish Fry : చేపలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. చేపలతో చేసే వంటకాల్లో చేపల ఫ్రై కూడా ఒకటి. చేపల ఫ్రై చాలా రుచిగాఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ గా తినడానికి, స్నాక్స్ గా తినడానికి ఇది చాలా చక్కగాఉంటుంది. చేపల ఫ్రైను మనం వివిధ రుచుల్లో తయారు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా కింద చెప్పిన విధంగా తయారు చేసే చేపల ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. మిరియాలు, నిమ్మరసం వేసి చేసే ఈ చేపల ఫ్రై చాలా రుచిగాఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. మరింత రుచిగా, అందరికి నచ్చేలా లెమనం పెప్పర్ చేపల ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మిరియాలు – 2 టీ స్పూన్స్, సోంపు గింజలు – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, బియ్యంపిండి – పావు కప్పు, నిమ్మకాయలు – 2, కొత్తిమీర – గుప్పెడు, చేప ముక్కలు – 700 గ్రా., నూనె – 2 టేబుల్ స్పూన్స్.
ముందుగా కళాయిలో మిరియాలు, సోంపు గింజలు వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లో మెత్తని పొడిగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యంపిండి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. తరువాత చేప ముక్కలను, నూనెను వేసి మసాలా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. తరువాత వీటిపై మూత పెట్టి 2 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తరువాత పెనం మీద నూనె వేసి వేడి చేయాలి. తరువాత చేప ముక్కలను వేసి మూత పెట్టి చిన్న మంటపై కాల్చుకోవాలి. వీటిని 3 నిమిషాలకొకసారి అటూ ఇటూ తిప్పుతూపైన కొద్దిగా నూనె వేసుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. చేప ముక్కలను చక్కగా కాల్చుకున్న తరువాత ప్లేట్ లోకి తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చేపల ఫ్రై తయారవుతుంది. దీనిని ఒక్క ముక్క కూడా విడిచిపెట్టకుండా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. తరుచూ ఒకేరకంగా కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు.