Lizard Fell On Men : మనకు నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి ఎలా బయటపడాలో ప్రాచీన కాలంలోనే శాస్త్రాల ద్వారా ఋషులు మనకు తెలియజేశారు. మనకు వచ్చే సమస్యలకు వారు ఏనాడో పరిష్కార మార్గాలను సూచించారు. మహర్షులు సూచించిన వాటిల్లో బల్లి శాస్త్రం కూడా ఒకటి. పొరపాటున మన మీద బల్లిపడితే అది పడిన శరీర భాగాలను బట్టి శుభ, అశుభ ఫలితాలను, వాటికి సంబంధించిన పరిహారాలను బల్లిశాస్త్రంలో సవివరంగా వర్ణించారు. బల్లిమీద పడినప్పుడు స్త్రీ, పురుషులకు ఫలితాలు వేరుగా ఉంటాయి. పురుషుల మీద బల్లి పడినప్పుడు కలిగే ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పురుషుల తల మీద బల్లి పడితే ఎదుటి వారితో కలహాలు అవుతాయని అలాగే మృత్యు భయాలు వెంటడతాయని బల్లిశాస్త్రం తెలియజేస్తోంది. అలాగే నుదుటి మీద బల్లి పడితే దూరంగా ఉండే బంధువుల నుండి కీడు వార్త వింటారు. ఒకవేళ బల్లి కనుక పురుషుల ముఖం మీద పడినట్టయితే ఆకస్మిక ధన లాభం కలుగుతుందని బల్లిశాస్త్రం చెబుతోంది. అదే విధంగా బల్లి కుడి కన్ను పై మీద పడితే అపజయాలు కలుగుతాయి. ఎడమ కన్ను మీద పడితే శుభం కలుగుతుంది. బల్లి గనుక కుడి చెవి మీద పడితే దుఖం వెంటాడుతుంది. ఎడమ చెవి మీద పడితే ఆదాయం బాగా వస్తుంది.
ముక్కు మీద బల్లిపడితే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. పురుషుల మీసం మీద బల్లి పడితే కష్టాలు వస్తాయి. పై పెదవి మీద పడితే ఇతరులతో గొడవలు పడతారని, కింది పెదవి మీద పడితే లాభం కలుగుతుందని.. రెండు పెదవుల మీద పడితే మృత్యువు కలుగుతుందని ఋషులు బల్లి శాస్త్రంలో తెలియజేశారు. అదే విధంగా మెడ మీద బల్లి పడితే పుత్రుడు పుడతాడు. కంఠం మీద బల్లి పడితే శత్రుభయం వెంటాడతుందని పెద్దలు తెలియజేశారు. పురుషుల కుడి భుజం మీద బల్లిపడితే కష్టాలు వస్తాయని, ఎడమ భుజం మీద బల్లి పడితే సంఘంలో మర్యాద తగ్గుతుందని బల్లిశాస్త్రం మనకు తెలియజేస్తోంది.
బల్లి పురుషుల వీపుపై పడితే విజయం కలుగుతుందని, మణికట్టు మీద పడితే అలంకార ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. చేతివేళ్ల మీద బల్లి పడితే ఆకస్మికంగా బంధు మిత్రులు వస్తారని, అర చేతిలో పడితే ధన లాభం కలుగుతుందని బల్లి శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పురుషుల పొట్ట మీద బల్లి పడితే సంతానం కలుగుతుందని, మోకాళ్ల మీద పడితే వాహన లాభం కలుగుతుందని వారు తెలియజేస్తున్నారు. తొడ భాగంలో కనుక బల్లి పడితే విష కీటకాల వల్ల ప్రాణ హాని కలిగే అవకాశం ఉంటుంది. పాదాల మీద పడితే కష్టం వస్తుందని పాదాల వెనక పడితే ప్రయాణం చేయాల్సి వస్తుందని, పాదాల వేళ్ల మీద పడితే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
బల్లి మీద పడిన వెంటనే ఆందోళన చెందకూడదు. బల్లిమీద పడిన వెంటనే తలస్నానం చేసి ఇష్ట దైవానికి దీపారాధన చేయాలి. అలాగే రాళ్ల ఉప్పును నైవేద్యంగా సమర్పించి చెడు జరగకూడదు అని ప్రార్థిస్తే దోషం తొలగుతుంది. అలాగే కంచిలో వెండి, బంగారు బల్లులను తాకినా లేదా ఆ బల్లులు తాకిన వారిని మనం తాకిన కూడా దోషం తొలగిపోతుందని.. బల్లిశాస్త్రం మనకు తెలియజేస్తోంది.