మనం శివాలయానికి వెళ్లగానే అక్కడ మనకు శివలింగం ముందు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా నంది దర్శనం చేసుకున్న తరువాతనే శివదర్శనం చేసుకోవాలి. ఈ క్రమంలోనే కొందరు నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తూ ప్రార్థిస్తారు. ఈ విధంగా శివుడిని దర్శించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే శివుడిని ఈ విధంగా నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుంచి ఎందుకు దర్శించుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
నందీశ్వరుడు పరమశివుడికి పరమ భక్తుడు. అదేవిధంగా శివుడి వాహనం కూడా నందీశ్వరుడే. శివుడి అనుగ్రహం మనపై కలగాలంటే ముందుగా నందీశ్వరుడి అనుగ్రహం తప్పనిసరి. నందీశ్వరుడిని సాక్షాత్తు వేద ధర్మానికి ప్రతీకగా భావిస్తారు. నంది కొమ్ములలో ఒకటి త్రిశూలానికి, మరొకటి సుదర్శనానికి ప్రతీక అని వేదాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలోనే లింగ రూపంలో ఉన్న పరమేశ్వరుడిని దర్శించాలంటే ముందుగా నందీశ్వరుడి ముందు పువ్వులను సమర్పించి.. పృష్ట (వెనుక) భాగాన్ని కుడిచేతితో తాకుతూ.. ఎడమ చేతి వేళ్ళను నందీశ్వరుడి కొమ్ములపై ఉంచి శివలింగ దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా కొమ్మల మధ్యలో నుంచి శివ లింగ దర్శనం చేసుకోవడం వల్ల మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.