Coriander Rice : కొత్తిమీర రైస్‌.. నిమిషాల్లో త‌యారు చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం..

Coriander Rice : మ‌నం చేసే వంట‌లు పూర్తి అయిన త‌రువాత చివ‌ర్లో కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేస్తూ ఉంటాం. చివ‌ర్లో వేసేదే అయిన కొత్తిమీర‌ను వేయ‌డం వ‌ల్ల వంటల‌ రుచి పెర‌గ‌డ‌మే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. కొత్తిమీర‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కంటి చూపును, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్త హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, ర‌క్త నాళాల‌లో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌కుండా చేయ‌డంలో కొత్తిమీర మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. కొత్తిమీర‌ను వంట‌ల త‌యారీలోనే కాకుండా దీనితో రైస్ ను కూడా తయారు చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఇక కొత్తిమీర రైస్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్తిమీర రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కొత్తిమీర క‌ట్ట – 1 (మ‌ధ్య‌స్థంగా ఉన్న‌ది), నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు – 5 లేదా త‌గిన‌న్ని, పుదీనా ఆకులు – గుప్పెడు, నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యం – ఒక గ్లాస్, నీళ్లు – ఒకటిన్న‌ర గ్లాస్, ఉప్పు – త‌గినంత‌, చిన్నగా త‌రిగిన ఉల్లిపాయ – 1 ( పెద్ద‌ది), త‌రిగిన ట‌మాట – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్.

make Coriander Rice in minutes of time easy recipe
Coriander Rice

మ‌సాలా దినుసులు..

బిర్యానీ ఆకు – 2, సాజీరా – ఒక టీ స్పూన్, ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, దాల్చిన చెక్క ముక్క‌లు – 2, అనాస పువ్వు – 1, మ‌రాఠీ మొగ్గ – 1.

కొత్తిమీర రైస్ త‌యారీ విధానం..

ముందుగా కొత్తిమీర‌ను కాడ‌ల‌తో సహా కోసి ఒక గిన్నెలోకి శుభ్రంగా క‌డిగి ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే పుదీనా ఆకుల‌ను, ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను, కొద్దిగా నీటిని పోసి మెత్త‌గా పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె, నెయ్యి వేసి అవి కాగిన త‌రువాత మ‌సాలా దినుసుల‌ను వేయాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఒక నిమిషం పాటు వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌ల‌ను వేసి అవి రంగు మారే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత ట‌మాట ముక్క‌ల‌ను వేసి అవి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ను, ఉప్పును వేసి క‌లిపి మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత నీళ్ల‌ను పోసి క‌లిపి ఉడికించాలి. త‌రువాత నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యాన్ని వేసి క‌లిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి. త‌రువాత మూత తీసి ఒక‌సారి అంతా క‌లిపి మ‌ర‌లా మూత పెట్టి చిన్న మంట‌పై బియ్యం పూర్తిగా ఉడికే వ‌ర‌కు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేయాలి.

స్ట‌వ్ ఆఫ్ చేసిన 5 నిమిషాల తరువాత అన్నాన్ని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర రైస్ త‌యార‌వుతుంది. దీనిని నేరుగా లేదా రైతాతో క‌లిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. కూర చేయ‌డానికి స‌మ‌యం లేన‌ప్పుడు లేదా ఏ కూర చేయాలో తెలియ‌న‌ప్పుడు ఇలా కొత్తిమీర‌తో రైస్ ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts