Egg Rice : మిగిలిపోయిన అన్నాన్ని ప‌డేయ‌కండి.. దాంతో ఎగ్ రైస్‌ను ఇలా చేయండి..

Egg Rice : కోడిగుడ్ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్ల‌తో చేసే ఎటువంటి వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఎగ్ రైస్ ఒక‌టి. అన్నం ఎక్కువ‌గా మిగిలిన‌ప్పుడు ఇలా ఎగ్ రైస్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇలా ఎగ్ రైస్ ను చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డంతో పాటు అన్నం కూడా వృద్ధా కాకుండా ఉంటుంది. మిగిలిన‌ అన్నంతో మ‌రింత రుచిగా, చాలా సుల‌భంగా ఎగ్ రైస్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అన్నం – 200 గ్రాముల బియ్యంతో వండినంత‌, కోడిగుడ్లు – 4, నూనె – 3టేబుల్ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 2, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా తరిగిన ప‌చ్చిమిర్చి – 2, క్యాప్సికం త‌రుగు – పావు క‌ప్పు, ట‌మాట త‌రుగు – పావు క‌ప్పు, ఉప్పు- త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – అర‌ టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

make Egg Rice with left over rice recipe in telugu
Egg Rice

ఎగ్ రైస్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కోడిగుడ్ల‌ను వేసుకోవాలి. వీటిని ఒక నిమిషం పాటు క‌దిలించ‌కుండా ఉండాలి. త‌రువాత కొద్దిగా ఉప్పు వేసి ముక్క‌లుగా చేసుకోవాలి. వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో ఒక టీస్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర‌, క‌రివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత క్యాప్సికం, ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించిన త‌రువాత ప‌సుపు, ఉప్పు, కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత వేయించిన కోడిగుడ్లు వేసి క‌ల‌పాలి. త‌రువాత అన్నాన్ని పొడి పొడిగా చేసుకుని వేసుకోవాలి. దీనిని పెద్ద మంట‌పై అంతా క‌లిసేలా బాగా క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మిరియాల పొడి, కొత్తిమీర వేసి క‌లుపుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ రైస్ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. కేవలం మిగిలిన అన్నంతోనే కాకుండా తాజా అన్నంతో కూడా ఈ ఎగ్ రైస్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు, ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు, అన్నం ఎక్కువ‌గా మిగిలిన‌ప్పుడు ఇలా ఎగ్ రైస్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts