మళ్లీ వేసవి కాలం వచ్చేసింది. ఎప్పటిలాగే హాట్ హాట్ ఎండలను మోసుకుని కూడా వచ్చింది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు దాదాపుగా సెలవులు ఇచ్చేశారు. దీంతో ఈ హాట్ సమ్మర్‌లో చాలా మంది ఎటైనా టూర్ వేయాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే ఎప్పుడూ వెళ్లే రొటీన్ ప్రాంతాలకు కాకుండా కింద ఇచ్చిన చూడ చక్కని ప్రకృతి అందాలను కనువిందు చేసే ప్రాంతాలకు వెళ్లి చూడండి. దాంతో ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో మాటల్లో చెప్పలేం. సమ్మర్ లో మిమ్మల్ని ఆకట్టుకునే టాప్ టూరిస్ట్ ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో ఎంజాయ్ చేసేందుకు వయనాడ్ ఒక చక్కని ప్రదేశం. ఇక్కడ ఉండే యాలకులు, కాఫీ తోటలతోపాటు పచ్చని ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. ఒత్తిడి, ఆందోళన దూరమవ్వాలంటే ఈ ప్రదేశానికి వెళ్లాల్సిందే. కేరళలో ఉన్న ఈ ప్రదేశంలో ఎడక్కల్ గుహలు, తిరునెల్లి టెంపుల్, సూచిపర జలపాతం, పూకొడె సరస్సు, బాణాసుర సాగర్ డ్యామ్ పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ట్రెక్కింగ్, కేవ్స్ ఎక్స్‌ప్లొరేషన్, వైల్డ్ లైఫ్, బోటింగ్, సైక్లింగ్ ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లేదా నిలంబూర్ రోడ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటే ఇక్కడికి వెళ్లడం చాలా సులువు.
గోవా.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది టూరిస్టులు ఇష్టపడే ప్రదేశం ఇది. ఇక్కడి బీచ్‌లు టూరిస్టులను ప్రధానంగా ఆకట్టుకుంటాయి. దీంతోపాటు అనేక ఇతర పర్యాటక ప్రదేశాలు కూడా గోవాలో ఉన్నాయి. స్కూబా డైవింగ్, స్నోర్కెలింగ్, బనానా బోట్, స్విమ్మింగ్, పారాలైజింగ్, జెట్ స్కీయింగ్, ప్లాంటేషన్ వాక్, సర్ఫింగ్, సీనిక్ డ్రైవ్ వంటివి గోవాలో ప్రధాన ఆకర్షణలు. ఇక్కడికి నేరుగా విమానం, రైలు లేదా బస్సులో చేరుకోవచ్చు. చూడ చక్కని ప్రకృతి అందాలు, బీచ్‌లు అండమాన్ దీవుల్లో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. సెల్యులార్ జైల్, ఎలిఫెంట్ బీచ్, కోవ్ బీచ్, రాధానగర్ బీచ్, మెరీనా పార్క్ వంటివి ప్రధాన ఆకర్షణలు. అండర్ వాటర్ వాకింగ్, జెట్ స్కీయింగ్, పారాలైజింగ్, ట్రెక్కింగ్, డాల్ఫిన్ వాచింగ్, స్కూబా డైవింగ్, ఐలాండ్ హోపింగ్ వంటి వాటిని పర్యాటకులు ఇష్ట పడుతారు. పోర్ట్ బ్లెయిర్‌కు విమానం ద్వారా చేరుకోవచ్చు.
వేపవి కాలంలో చల్లని ప్రదేశంలో సేద తీరాలనుకునే వారికి ఊటీ చక్కని ప్రదేశం. ఇక్కడి పచ్చని కొండ ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. బొటానికల్ గార్డెన్, రోజ్ గార్డెన్, ఊటీ లేక్, అవ్‌లాంచ్ లేక్, ఎమరాల్డ్ లేక్ తదితర ప్రాంతాలు ఇక్కడ చూడదగినవి. సైక్లింగ్, బోటింగ్, హైకింగ్, క్యాంపింగ్, బర్డ్ వాచింగ్, ఫిషింగ్, సైట్ సీయింగ్ వంటివి ఇక్కడి యాక్టివిటీలు. కోయంబత్తూర్ ఎయిర్‌పోర్టు, ఉదగ మండలం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటే ఊటీని రీచ్ కావచ్చు. హిమాలయాలను చూడాలనుకుంటే ఔలికి వెళ్లవచ్చు. చల్లని ప్రకృతి అందాలు ఇక్కడ కనువిందు చేస్తాయి. త్రిశూల్ పీక్, చీనాబ్ లేక్, జోషిమఠ్, రుద్ర ప్రయాగ్, నంద ప్రయాగ్ వంటివి ఇక్కడ చూడదగిన ప్రదేశాలు. స్కీయింగ్, స్నో బోర్డింగ్, ట్రెక్కింగ్, క్యాంపింగ్, స్నో మొబైలింగ్, ట్యూబింగ్, రోప్ వే వంటివి ఇక్కడి యాక్టివిటీలు. డెహ్రాడూన్ ఎయిర్ పోర్టు లేదా హరిద్వార్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటే ఇక్కడికి వెళ్లవచ్చు.
నైనిటాల్.. ఇక్కడి పచ్చని కొండ కోనలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, జూ, నైనిటాల్ లేక్, గర్నీ హౌస్, నైనా దేవి ఆలయం, కేవ్ గార్డెన్ వంటివి ఇక్కడ చూడదగిన ప్రదేశాలు. వైల్డ్ లైఫ్ విజిట్, బోటింగ్, సైట్ సీయింగ్, ట్రెక్కింగ్, రోప్ వే, జీప్ సఫారి తదితర యాక్టివిటీలు ఇక్కడ ఉంటాయి. పంత్‌నగర్ ఎయిర్‌పోర్ట్, కాత్‌గోడమ్ ట్రెయిన్ స్టేషన్‌కు వస్తే ఇక్కడికి రావచ్చు. చూడ చక్కని పచ్చని అందాలతో నిండిన టీ తోటలు డార్జిలింగ్‌లో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడి జూ పార్క్, బటాసియా లూప్, పీస్ పగోడా, గూమ్ మోనాస్టరీ, డార్జిలింగ్ మాల్, హిమాలయన్ రైల్వే వంటివి చూడదగిన ప్రదేశాలు. టాయ్ ట్రైన్ రైడ్, వైల్డ్ లైఫ్ విజిట్, సైట్ సీయింగ్, ప్లాంటేషన్ వాక్, బ్యాక్ ప్యాకింగ్ వంటివి యాక్టివిటీలు. బాగ్ డోగ్రా ఎయిర్ పోర్ట్, న్యూ జల్‌పయ్‌గురి రైల్వే స్టేషన్‌కు చేరితే డార్జిలింగ్ రావచ్చు.
వేసవిలో చూడచక్కని పచ్చని ప్రకృతి అందాలు కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రం వెళ్లాలనుకునే వారికి రిషికేష్ గొప్ప టూరిస్ట్ ప్లేస్‌గా ఉంటుంది. ఇక్కడ ప్రకృతి నుంచి వచ్చే సహజ సిద్ధమైన గాలులు ఆహ్లాదాన్ని ఇస్తాయి. రాజాజీ నేషనల్ పార్క్, రామ్ ఝులా, లక్ష్మణ్ జుల్లా బ్రిడ్జి, త్రివేణి ఘాట్, గీతా భవన్, శివానంద ఆశ్రమ్ వంటివి చూడదగిన ప్రదేశాలు. జాలీ గ్రాంట్ ఎయిర్‌పోర్ట్, రిషికేష్ రైల్వే స్టేషన్‌లు ఇక్కడి దగ్గరి ప్రాంతాలు. పచ్చని ప్రకృతి కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం మున్నార్‌లో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. హనీమూన్ వచ్చే వారికి ఇది బెస్ట్ ప్లేస్. ఎరవికులం నేషనల్ పార్క్, మటుపెట్టీ డ్యామ్, టీ మ్యూజియం, అట్టుకల్ వాటర్ ఫాల్స్, అనముడి, దేవికులం ప్రాంతాలు చూడదగినవి. ట్రెక్కింగ్, బోటింగ్, వైల్డ్ లైఫ్ విజిట్, బర్డ్ వాచింగ్, సైట్ సీయింగ్, సఫారి, క్యాంపింగ్ యాక్టివిటీలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్, మదురై ఎయిర్ పోర్టు, అలువా, ఎర్నాకులం, మదురై రైల్వే స్టేషన్ల నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు.
వేసవిలో చల్లగా ఎంజాయ్ చేయాలనుకుంటే శ్రీనగర్ వెళ్లవచ్చు. పూల తోటలు, ఉద్యానవనాలు, వాటర్ ఫ్రంట్స్, హౌస్ బోట్లు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. దాల్ లేక్, షాలిమార్ బాగ్, నిషాత్ గార్డెన్, చష్మే షాహి గార్డెన్, దాచిగం నేషనల్ పార్క్, తులిప్ గార్డెన్, పరి మహల్ వంటి ప్రాంతాలు ఇక్కడ చూడదగినవి. బోటింగ్, ఫిషింగ్, వైట్ వాటర్ రాఫ్టింగ్, కయాకింగ్, క్యాంపింగ్, సైట్ సీయింగ్ ఇక్కడి యాక్టివిటీలు. శ్రీనగర్ ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్లకు నేరుగా చేరుకోవచ్చు. మహాబలేశ్వరం.. ఇక్కడి పచ్చని కొండలు, అడవులు, ప్రకృతి అందాలు, తోటలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. స్ట్రాబెర్రీ తోటలు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. వేసవిలో టూర్ వేయాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్. వెన్నా లేక్, ప్రతాప్‌గడ్ ఫోర్ట్, విల్సన్ పాయింట్, ధోబీ వాటర్ ఫాల్, చైనామన్ వాటర్ ఫాల్, వెన్నా డ్యామ్‌లు చూడదగిన ప్రదేశాలు. ప్లాంటేషన్ వాక్, బ్యాక్ ప్యాకింగ్, సైట్ సీయింగ్, రాక్ క్లైంబిగ్, హార్స్ రైడింగ్, ఆర్చరీ, జిప్ లైనింగ్ వంటివి ఇక్కడి యాక్టివిటీలు. లోహెన్‌గోవాన్ ఎయిర్ పోర్ట్ (పూనె), దివాన్ ఖవాటి, కరన్‌జడి రైల్వే స్టేషన్లకు వస్తే మహాబలేశ్వరం సులభంగా చేరుకోవచ్చు.
పచ్చని, చల్లని, ఆహ్లాదకరమైన పర్వత ప్రాంతాలలో గడపాలంటే అల్మోరా వెళ్లాలి. ఇక్కడ జగేశ్వర్ ధామ్, బిన్సర్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ, కాసర్ దేవి టెంపుల్, జీరో పాయింట్, కాటర్‌మల్ సన్ టెంపుల్, చిటాయ్ టెంపుల్, మ్యూజియం చూడదగిన ప్రదేశాలు. సైట్ సీయింగ్, సీనిక్ డ్రైవ్, క్యాంపింగ్, నేచర్ వాక్, ట్రెక్కింగ్ వంటి యాక్టివిటీలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పంత్‌నగర్ ఎయిర్ పోర్ట్, కాత్‌గోడం రైల్వే స్టేషన్‌కు వస్తే అల్మోరా చేరుకోవచ్చు. కన్యాకుమారి.. ఇక్కడి సముద్రపు అందాలు, కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు, సూర్యాస్తమయం టూరిస్టులను ఆకట్టుకుంటాయి. వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువర్ స్టాచ్యూ, పద్మనాభపురం ప్లేస్, తనుమళయన్ టెంపుల్, మధుర్ ఆక్‌డక్ట్, అవర్ లేడీ రాన్సమ్ ష్రైన్ వంటివి చూడదగిన ప్రదేశాలు. బోటింగ్, స్విమ్మింగ్, సైట్ సీయింగ్, హైకింగ్, సీనిక్ డ్రైవ్‌లు ఇక్కడి యాక్టివిటీలు. తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్, కన్యాకుమారి రైల్వే స్టేషన్లు ఇక్కడికి దగ్గరి ప్రాంతాలు.
లెహ్.. మట్టి ఇళ్లు, టిబెట్ స్టైల్ ప్యాలెస్‌లు, ప్రకృతి అందాలు ఇక్కడ పర్యాటకులను ఆకట్టుకుంటాయి. శాంతి స్థూప, లెహ్ ప్యాలెస్, తిక్సె మోనాస్టరీ, హాల్ ఆఫ్ ఫేమ్, స్పితుక్ మోనాస్టరీ, ఫ్యాంగ్ గొంపాలు చూడదగిన ప్రదేశాలు. హైకింగ్, సీనిక్ డ్రైవ్, క్యాంపింగ్, బర్డ్ వాచింగ్, సైట్ సీయింగ్, మెడిటేషన్ ఇక్కడి యాక్టివిటీలు. కుశోక్ బకులా రింపోచీ ఎయిర్‌పోర్ట్, పఠాన్‌కోట్ రైల్వే స్టేషన్లు ఇక్కడికి దగ్గరి ప్రాంతాలు. తవాంగ్.. సముద్ర మట్టానికి ఈ ప్రదేశం 3048 మీటర్ల ఎత్తులో ఉంటుంది. పచ్చని ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం ఇక్కడ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. తవాంగ్ మోనాస్టరీ మ్యూజియం, తవాంగ్ వార్ మెమోరియల్, వాటర్ ఫాల్స్, సెలా పాస్, బమ్ లా పాస్, మధురి లేక్ వంటివి చూడదగిన ప్రాంతాలు. ట్రెక్కింగ్, సైట్ సీయింగ్, క్యాంపింగ్, నేచర్ వాక్, మెడిటేషన్, సీనిక్ డ్రైవ్‌లు యాక్టివిటీలు. తేజ్‌పూర్ ఎయిర్‌పోర్ట్, లోక్‌ప్రియ బోర్డోలోయ్ ఎయిర్‌పోర్ట్, తేజ్‌పూర్ రైల్వే స్టేషన్లు ఇక్కడికి దగ్గరి ప్రాంతాలు.