Sweet Corn : స్వీట్ కార్న్‌తో ఆరోగ్యానికి మేలు చేసేలా స్వీట్‌.. త‌యారీ ఎంతో సుల‌భం..!

Sweet Corn : తీపిని ఇష్ట‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉంటారు. వారికి త‌గిన‌ట్టు బ‌య‌ట స్వీట్ షాపుల్లో ర‌క‌ర‌కాల స్వీట్స్ ల‌భిస్తూ ఉంటాయి. అలాగే ఇంట్లో కూడా ర‌క‌ర‌కాల స్వీట్ ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కానీ వీటి త‌యారీలో పంచ‌దార‌ను ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు. అదేవిధంగా నూనె లేదా నెయ్యిని కూడా ఎక్కువ మోతాదులో వాడుతూ ఉంటారు. ఇలా త‌యారు చేసిన స్వీట్స్ ను మ‌నం ఎక్కువ మోతాదులో తిన‌లేము. వీటిని తిన‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేసేలా ఒక చుక్క నూనెను వాడ‌కుండా కూడా మ‌నం స్వీట్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ స్వీట్ ను త‌యారు చేయ‌డానికి మ‌నం స్వీట్ కార్న్ ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా స్వీట్ కార్న్ తో స్వీట్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వీట్ కార్న్ స్వీట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స్వీట్ కార్న్ – 2, ప‌చ్చి కొబ్బ‌రి తురుము – ఒక క‌ప్పు, ఉప్పు – చిటికెడు, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్, మొక్క జొన్న‌పిండి – ముప్పావు క‌ప్పు, కండెన్స్డ్ మిల్క్ – పావు క‌ప్పు.

make healthy sweet with Sweet Corn know how to cook it
Sweet Corn

స్వీట్ కార్న్ స్వీట్ త‌యారీ విధానం..

ముందుగా స్వీట్ కార్న్ కంకుల‌ను తీసుకుని వాటిపై ఉండే పొట్టును చిరిగిపోకుండా జాగ్ర‌త్త‌గా తీయాలి. త‌రువాత వీటిని నీటితో శుభ్రంగా క‌డ‌గాలి. ఇవి ఎండిపోకుండా వాటిపై కొన్ని నీటిని చ‌ల్లి ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ గింజ‌ల‌ను వ‌లిచి వాటిని జార్ లో వేయాలి. ఈ గింజ‌ల‌ను కచ్చాప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత దీనిలో ప‌చ్చికొబ్బ‌రి తురుము, ఉప్పు, యాల‌కుల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత మొక్క జొన్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ క‌ల‌పాలి. త‌రువాత కండెన్స్డ్ మిల్క్ ను వేసి క‌ల‌పాలి. కండెన్స్డ్ మిల్క్ కు బ‌దులుగా బెల్లాన్ని కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇలా తయారు చేసుకున్న మిశ్ర‌మాన్ని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకుని ముందుగా సిద్దం చేసుకున్న కంకి పొట్టులో ఉంచి పొట్లంలా క‌ట్టుకోవాలి. ఇవి ఊడిపోకుండా కాట‌న్ దారాన్ని లేదా అదే కంకి పొట్టును స‌న్న‌గా చీల్చి క‌ట్టాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత స్ట‌వ్ మీద గిన్నెను ఉంచి అందులో 2 క‌ప్పుల నీటిని వేసి వేడి చేయాలి.

నీళ్లు వేడ‌య్యాక అందులో చిల్లుల గిన్నెను ఉంచాలి. ఈ చిల్లుల గిన్నెలో ముందుగా త‌యారు చేసుకున్న స్వీట్ కార్న్ పొట్లాల‌ను ఉంచాలి. దీనిపై మూత‌ను ఉంచి ఆవిరి మీద 20 నుండి 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత వీటిని బ‌య‌ట‌కు తీసి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స్వీట్ కార్న్ స్వీట్ త‌యార‌వుతుంది. ఈ స్వీట్ ను తిన‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భిస్తుంది. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు కూడా దీనిలో బెల్లం వేసి త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ విధంగా స్వీట్ కార్న్ తో స్వీట్ ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు స్వీట్ కార్న్ లో ఉండే పోష‌కాల‌ను కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts