Malai Kulfi : చ‌ల్ల చ‌ల్ల‌గా మ‌ల‌య్ కుల్ఫీ.. ఇంట్లోనే ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Malai Kulfi : వేస‌వి కాలంలో స‌హ‌జంగానే మ‌నం చ‌ల్ల చ‌ల్ల‌ని ప‌దార్థాల‌ను, పానీయాల‌ను తీసుకునేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటాం. శ‌రీరం చ‌ల్ల‌గా ఉండేందుకు ఆయా ఆహారాల‌ను తీసుకుంటుంటాం. అయితే వేస‌విలో తిన‌ద‌గిన చ‌ల్ల‌ని ఆహారాల్లో మ‌ల‌య్ కుల్ఫీ ఒక‌టి. ఇది మ‌న‌కు బ‌య‌ట ల‌భిస్తుంది. కానీ కాస్త శ్ర‌మిస్తే ఇంట్లోనే ఎంతో రుచిగా దీన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. ఇక మ‌ల‌య్ కుల్ఫీని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ల‌య్ కుల్పీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిక్క‌ని పాలు – ఒక లీట‌ర్, పాల పొడి – 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, పంచ‌దార – అర క‌ప్పు, త‌రిగిన బాదం ప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన జీడి ప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన పిస్తా – 2 టేబుల్ స్పూన్స్, యాల‌కుల పొడి – ఒక టీ స్పూన్.

make Malai Kulfi at your home very easy method
Malai Kulfi

మ‌ల‌య్ కుల్ఫీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో పాల పొడిని తీసుకుని త‌గిన‌న్ని నీళ్ల‌ను పోసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. అదే విధంగా కార్న్ ఫ్లోర్ లో కూడా తగిన‌న్ని నీళ్ల‌ను పోసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పాల‌ను పోసి చిన్న మంట‌పై లీట‌ర్ పాలు అర లీట‌ర్ అయ్యే వ‌ర‌కు క‌లుపుతూ మ‌రిగించాలి. పాలు మ‌రిగిన త‌రువాత ముందుగా ఉండ‌లు లేకుండా క‌లిపి పెట్టుకున్న పాల పొడిని, కార్న్ ఫ్లోర్ ను వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌రిగిన డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్ర‌మం పూర్తిగా చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. చ‌ల్ల‌గా అయ్యే కొద్ది కుల్పీ మిశ్ర‌మం ద‌గ్గ‌ర ప‌డుతూ ఉంటుంది. కుల్ఫీ మిశ్ర‌మం చ‌ల్ల‌గా అయిన త‌రువాత కుల్ఫీ అచ్చుల‌లో వేసి మూత పెట్టి 8 నుండి 9 గంట‌ల పాటు డీప్‌ ఫ్రిజ్ లో ఉంచాలి.

కుల్ఫీ అచ్చులు లేని వారు గ్లాసుల‌ల్లో లేదా గిన్నెలల్లో వేసుకోవాలి. ఇలా కుల్ఫీ మిశ్ర‌మాన్ని వేసిన గ్లాసుల‌ను లేదా గిన్నెల‌ను మూత ఉండే మ‌రో గిన్నెలో ఉంచి మూత పెట్టి ఫ్రిజ్ లో పెట్టాలి. 8 లేదా 9 గంట‌ల త‌రువాత వీటిని బ‌య‌టికి తీసి పుల్ల‌ల‌ను గుచ్చాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ల్ల చ‌ల్లగా ఎంతో రుచిగా ఉండే మ‌ల‌య్ కుల్ఫీ త‌యార‌వుతుంది. ఈ కుల్ఫీ త‌యారీలో కార్న్ ఫ్లోర్ కు బ‌దులుగా క‌స్టర్డ్ పౌడ‌ర్ ను ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ విధంగా కుల్ఫీల‌ను త‌యారు చేసుకుని ఫ్రిజ్ లో ఉంచుకోవ‌డం వ‌ల్ల చ‌ల్ల చ‌ల్ల‌గా ఎప్పుడుప‌డితే అప్పుడు ఎంతో రుచిగా ఉండే మ‌ల‌య్ కుల్ఫీల‌ను తినవ‌చ్చు.

D

Recent Posts