Mutton Fry : ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ ఫ్రై.. ఇలా చేస్తే నోట్లో నీళ్లూర‌డం ఖాయం..!

Mutton Fry : మాంసాహారం అన‌గానే మ‌న‌లో చాలా మందికి గుర్తుకు వ‌చ్చే వాటిల్లో చికెన్‌, మ‌ట‌న్ ఉంటాయి. అయితే చికెన్‌తోపాటు మ‌ట‌న్ ను తినేవారు కూడా ఎక్కువ‌గానే ఉన్నారు. చికెన్ వ‌ల్ల కొంద‌రికి ద‌ద్దుర్లు వ‌స్తుంటాయి. కానీ మ‌ట‌న్‌తో అలా కాదు. క‌నుక కొంద‌రు మ‌ట‌న్‌ను తినేందుకే ఆస‌క్తిని చూపిస్తుంటారు. ఇక మ‌ట‌న్‌తో అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. వాటిల్లో మ‌ట‌న్ ఫ్రై ఒక‌టి. స‌రిగ్గా చేయాలే కానీ ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఇక మ‌ట‌న్ ఫ్రై ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

make Mutton Fry in this simple method very easy and tasty
Mutton Fry

మ‌ట‌న్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బోన్ లెస్ మ‌ట‌న్ – పావు కిలో, మిరియాలు – ఒక టీ స్పూన్, ల‌వంగాలు – 4, దాల్చిన చెక్క – 1, యాల‌కులు – 3, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ధ‌నియాలు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1 (పెద్ద‌ది), క‌రివేపాకు – ఒక రెబ్బ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – 3 టేబుల్ స్పూన్స్.

మ‌ట‌న్ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా ఒక కళాయిలో మిరియాలు, దాల్చిన చెక్క‌, ధ‌నియాలు, ల‌వంగాలు, యాల‌కులు, క‌రివేపాకు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించి చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ఉంచి జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి కాగిన త‌రువాత జీల‌క‌ర్ర‌, ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత ప‌సుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత శుభ్రంగా క‌డిగిన మ‌ట‌న్ ను, త‌గినంత ఉప్పును వేసి క‌లిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల త‌రువాత కారం పొడిని వేసి క‌లిపి మూత పెట్టి మ‌రో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

ఇప్పుడు మూత తీసి మ‌ట‌న్ లో ఉన్న నీరు అంతా పోయి మ‌ట‌న్ పూర్తిగా ఉడికే వ‌ర‌కు వేయించుకోవాలి. మ‌ట‌న్ పూర్తిగా వేగిన త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పొడిని వేసి క‌లిపి మ‌రో 3 నిమిషాల పాటు ఉంచి చివ‌ర‌గా కొత్తిమీర‌ను వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, పుల్కా, రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉండ‌డమే కాకుండా.. మ‌ట‌న్ లో ఉండే పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌ట‌న్ ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. బ‌రువు త‌క్కువ‌గా ఉన్న వారికి, వ్యాయామాలు చేసే వారికి మ‌ట‌న్ చ‌క్క‌ని ఆహార‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. గుండె ఆరోగ్యాన్ని, లైంగిక సామ‌ర్థ్యాన్ని పెంచ‌డంలో మ‌ట‌న్ ఎంతో స‌హాయ‌ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts