Okra Fry : మనం వంటింట్లో ఉపయోగించే కూరగాయలల్లో బెండకాయ ఒకటి. వీటిల్లో జిగురు ఎక్కువగా ఉంటుంది. బెండకాయలతో ఎక్కువగా మనం వేపుడు చేస్తూ ఉంటాం. కానీ వీటిల్లో ఉండే జిగురు కారణంగా ఈ వేపుడు పొడి పొడిగా రాదు. నూనె ఎక్కువగా వేసి వేయించడం వల్ల బెండకాయ వేపుడు పొడిగా వస్తుంది. కానీ నూనెను ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక నూనెను ఎక్కువగా వాడకుండా, పొడిగా ఉండేలా బెండకాయ వేపుడును ఎలా తయారు చేసుకోవాలి, తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
బెండకాయలు – అర కిలో, నూనె – 2 టీ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, పసుపు – కొద్దిగా, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, ఎండు మిర్చి – రెండు, కారం – తగినంత, ఉప్పు – తగినంత.
బెండకాయ వేపుడు తయారీ విధానం..
ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా చేసుకోవాలి. ఈ బెండకాయలను ముక్కలుగా కట్ చేసి ఏదైనా వస్త్రంపై లేదా పేపర్ పై వేసి ఎండ, గాలి తగిలేలా ఒక గంట పాటు ఆరబెట్టాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగాక జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ఆరబెట్టిన బెండకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. బెండ కాయ వేపుడు చేసేటప్పుడు కళాయిపై మూత పెట్టకూడదు. మూత పెట్టడం వల్ల ఆవిరి చేరి ముక్కలు మెత్తగా అవుతాయి. కనుక బెండకాయ ముక్కలపై మూత పెట్టకుండా బాగా వేయించుకోవాలి. ఈ ముక్కలు బాగా వేగిన తరువాత కారం, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. బెండకాయ వేపుడు చేసేటప్పుడు ఉప్పును ముందుగా వేయకూడదు. ఉప్పును ముందుగా వేయడం వల్ల నీరు చేరి ముక్కలు మెత్తగా అవుతాయి. చివరగా ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పొడి పొడిగా, ఎంతో రుచిగా ఉండే బెండకాయ వేపుడు తయారవుతుంది.