food

Pulihora Paste : పులిహోర పేస్ట్‌ను ఇలా త‌యారు చేస్తే చాలు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర రెడీ..!

Pulihora Paste : ఈ చిన్న చిన్న చిట్కాలని, ఈ కొలతలని కనుక పాటించి పులిహార చేస్తే ఎక్కువ రోజులు పాడైపోకుండా నిల్వ ఉంటుంది. రుచి అద్భుతంగా ఉంటుంది. ఎంతో రుచిగా మనం ఇంట్లోనే పులిహోర పులుసుని తయారు చేసుకోవచ్చు. పులిహోర పులుసు రెడీగా ఉందంటే చిటికెలో పులిహోర చేసేసుకోవచ్చు. మరి ఇక ఏం చేయాలనేది ఇప్పుడే చూసేద్దాం.

పులిహోర పులుసు కోసం ముందు మీరు 250 గ్రాముల చింతపండుని తీసుకోండి. ఆ చింతపండుని ఒకసారి బాగా కడుక్కుని, చింతపండు మునిగే వరకు నీళ్లు తీసుకోండి. చింతపండుని బాగా నానబెట్టాలి. ఒక అయిదు నిమిషాల పాటు ఈ చింతపండుని మరిగించండి. కొద్దిగా ఉడుకుతున్నప్పుడు స్టవ్ కట్టేయండి సరిపోతుంది.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని, ఉడికించిన చింతపండుని కొంచెం కొంచెం అందులో వేయండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత గుజ్జు తయారవుతుంది. ఇప్పుడు ఈ మిక్సీలో ఉన్న గుజ్జుని ఒక చిల్లుల ప్లేట్లో వేసుకుని మెత్తటి గుజ్జు మొత్తం వేరు అయ్యేవరకు కూడా సపరేట్ చేసుకోండి. కొంచెం కొంచెం వాటర్ ని వేసుకుంటూ గుజ్జుని బాగా వేరు చేసుకోండి. బాగా మెత్తగా వచ్చిన గుజ్జులో కొంచెం కరివేపాకు వేసుకోండి.

make pulihora paste like this

కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలని వేసుకోండి. పచ్చిమిరపకాయలను కట్ చేయక్కర్లేదు. డైరెక్ట్ గా వేసుకోండి. ఒక 50 నుండి 60 గ్రాముల వరకు సాల్ట్ వేసుకోండి. ఒక టీ స్పూన్ మిరియాలు, ఒక టీ స్పూన్ పసుపు కూడా ఇందులో వేసుకోండి. ఇందులో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీరు స్టవ్ మీద పెట్టి, ఉడికించుకోండి. చింతపండు బాగా చిక్కగా అవ్వాలి. అప్పటివరకు ఉడికించుకోండి. మూత పెడితే చింతగుజ్జు అందులోనే ఉంటుంది. లేదంటే తుళ్ళిపోతుంది.

ఒక 15 నిమిషాల పాటు దీనిని మొత్తం ఉడికించండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకోవాలి. ఇందులో అర టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ నువ్వులు, రెండు టీ స్పూన్ల ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మిరియాలు, పావు టీ స్పూన్ ఆవాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టి దోరగా వేయించుకోవాలి. తర్వాత వీటన్నిటినీ మిక్సీ జార్ లో వేసి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ వేస్తే ఎంతో రుచిగా ఉంటుంది.

ఇప్పుడు ఒక కప్పు నూనెని ఒక పాన్ లో వేసి నూనె వేడెక్కిన తర్వాత పల్లీలు, శనగపప్పు, మినపప్పు, మిరియాలు, ఆవాలు, 10 నుండి 12 ఎండు మిరపకాయలు, అర టీ స్పూన్ ఇంగువ వేసి వేయించుకోవాలి. పిడికెడు కరివేపాకు కూడా వేసుకోవాలి. స్టవ్ కట్టేసి ఇందాక తయారు చేసుకున్న పులిహోర పులుసు ని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా బెల్లం కూడా ఇప్పుడు ఇందులో వేసుకోండి.

ఈ మిశ్రమం అంతా చల్లారిపోయిన తర్వాత ఇందాక తయారు చేసుకున్న పౌడర్ ని ఇందులో మిక్స్ చేయాలి. అన్నం తీసుకుని అన్నంలో కొంచెం నూనె, పసుపు వేసుకుని పేస్ట్ ని మిక్స్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర ని రెడీ చేసుకోవచ్చు. దీనిని మీరు ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పాడైపోదు.

Admin

Recent Posts