Tangdi Kebab : ఓవెన్ లేకున్నా రెస్టారెంట్ స్టైల్‌లో తంగ్డీ క‌బాబ్‌ను ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

Tangdi Kebab : చికెన్ తో ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో తంగ్డి క‌బాబ్ ఒక‌టి. ఈ తంగ్డి క‌బాబ్ మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ఎక్కువ‌గా ల‌భ్య‌మ‌వుతుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ తంగ్డి క‌బాబ్ ను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. తందూర్, ఓవెన్ లేకున్నా రుచిగా రెస్టారెంట్ స్టైల్ లో తంగ్డి క‌బాబ్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తంగ్డి క‌బాబ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ లెగ్ పీసెస్ – 6, పెరుగు – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత, కారం – 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, క‌చ్చాప‌చ్చాగా దంచిన ప‌చ్చిమిర్చి – 5, నిమ్మ‌ర‌సం – రెండు టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, చాట్ మ‌సాలా- అర టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ – పావు టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, యాల‌కుల పొడి – 2 చిటికెలు, ప‌సుపు – పావు టీ స్పూన్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, చికెన్ తందూరి మ‌సాలా – 2 టీ స్పూన్స్, ఆవాల నూనె – 2 టీ స్పూన్స్, వంట‌సోడా – చిటికెడు, బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్.

make Tangdi Kebab in restaurant style even if you have no oven
Tangdi Kebab

తంగ్డి క‌బాబ్ త‌యారీ విధానం..

ముందుగా లెగ్ పీసెస్ ను శుభ్రంగా క‌డిగి వాటికి గాట్లు పెట్టి ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత ఒక కాట‌న్ వ‌స్త్రంలో పెరుగును తీసుకుని దానిలోని నీరు అంతా పోయేలా చేత్తో బాగా పిండాలి. త‌రువాత ఈ పెరుగును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అందులో బ‌ట‌ర్ త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లపాలి. ఈ మిశ్ర‌మాన్ని చికెన్ పీసెస్ కు బాగా ప‌ట్టించాలి. త‌రువాత వీటిని ఒక రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచి మారినేట్ చేసుకోవాలి. ఇలా మారినేట్ చేసుకున్న త‌రువాత ఫ్రిజ్ నుండి ముక్క‌ల‌ను బ‌య‌ట‌కు తీసి చ‌ల్ల‌ద‌నం పోయే వ‌ర‌కు బ‌య‌ట ఉంచాలి. త‌రువాత అడుగు భాగం మందంగా ఉండే క‌ళాయిని తీసుకుని దానికి కొద్దిగా నూనె రాసి వేడి చేయాలి.

క‌ళాయి వేడెక్కిన త‌రువాత అందులో బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి. బ‌ట‌ర్ క‌రిగిన త‌రువాత అందులో చికెన్ లెట్ పీసెస్ ను వేసి వేయించాలి. 10 నిమిషాల పాటు వేయించిన త‌రువాత వీటిని మ‌రో వైపుకు తిప్పి మ‌రో 10 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత వీటిపై మూత‌ను ఉంచి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత ముక్క‌ల‌ను ప‌క్కకు జ‌రిపి వాటిలో ఒక చిన్న గిన్నెను ఉంచాలి. ఈ గిన్నెలో కాల్చిన బొగ్గును వేసి అందులో బ‌ట‌ర్ ను వేసి మూత పెట్టాలి. బొగ్గు నుండి వ‌చ్చే పొగ అంతా పోయే వ‌ర‌కు మూత తీయ‌కుండా అలాగే ఉంచి పొగ రావ‌డం పూర్త‌యిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి దానిపై పుల్కా కాల్చుకునే పెన్నాన్ని ఉంచాలి.

త‌రువాత దానిపై చికెన్ పీసెస్ ను ఉంచి 10 నుండి 15 సెక‌న్ల పాటు అటూ ఇటూ తిప్పుతూ మంట‌పై కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే తంగ్డి క‌బాబ్ త‌యార‌వుతుంది. దీనిని మింట్ చ‌ట్నీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అప్పుడ‌ప్పుడూ చికెన్ తో ఇలా తంగ్డి క‌బాబ్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఇష్టంగా తింటారు.

D

Recent Posts