Mamidikaya Rasam : పండిన మామిడికాయలతో పాటు పచ్చి మామిడికాయలను కూడా మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. మామిడికాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. మామిడికాయలను నేరుగా తినడంతో పాటు వీటితో మనం వివిధ రకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. మామిడికాయ పచ్చడి, మామిడికాయ పప్పు, పులిహోర ఇలా అనేక రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా మామిడికాయలతో మనం ఎంతో రుచిగా ఉండే రసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. మామిడికాయలతో చేసే ఈ రసం పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. మామిడికాయలతో రుచిగా రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడికాయ రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి మామిడికాయ ముక్కలు – ఒక కప్పు, టమాట ముక్కలు – అర కప్పు, కందిపప్పు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కరివేపాకు – రెండు రెమ్మలు, ఎండుమిర్చి – 3, మిరియాలు – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, అల్లం తురుము – అర టీ స్పూన్, వెల్లుల్లి తురుము – అర టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్.
మామిడికాయ రసం తయారీ విధానం..
ముందుగా కళాయిలో కందిపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో మామిడికాయ ముక్కలు, టమాట ముక్కలు వేసి అవి మునిగే వరకు నీటిని పోయాలి. తరువాత వీటిని మెత్తగా ఉడికించాలి. ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత వీటిని గుజ్జుగా చేసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి మరలా స్టవ్ ఆన్ చేసి అల్లం తురుము, వెల్లుల్లి తురుము, పసుపు, ఉప్పు, ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి.
తరువాత ఈ రసాన్ని బాగా మరిగించాలి. రసం మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత దీనిని రసంలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మామిడికాయ రసం తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ రసాన్ని అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. మామిడి కాయలు లభించినప్పుడు ఇలా మామిడికాయ రసాన్ని తయారు చేసుకుని తినవచ్చు.