Masala Vada : బయట మనకు తినేందుకు అనేక రకాల చిరుతిళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మసాలా వడలు ఒకటి. బయట తోపుడు బండ్లపై విక్రయించే వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే బయట తినే ఆ ఆహారాలు మనకు హాని చేస్తాయి. ఇంట్లోనే వీటిని తయారు చేసుకుని తినడం మంచిది. ఇక ఇంట్లోనే ఎంతో రుచికరంగా మసాలా వడలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగ పప్పు – పావు కిలో, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 2 (మధ్యస్థంగా ఉన్నవి), చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 4, కరివేపాకు – రెండు రెబ్బలు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్నగా తరిగిన తోటకూర – అర కప్పు, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత, గరం మసాలా – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
మసాలా వడ తయారీ విధానం..
ముందుగా శనగ పప్పులో తగినన్ని నీళ్లను పోసి మూడు నుండి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. శనగపప్పు నానిన తరువాత నీరు లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పును నుండి రెండు టేబుల్ స్పూన్ల పప్పును తీసి పక్కకు పెట్టుకోవాలి. మిగిలిన శనగపప్పును జార్లో వేసి నీళ్లు వేయకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి కలుపుకోవాలి.
ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న శనగపప్పును కూడా వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కావల్సిన పరిమాణంలో తీసుకుని ముద్దలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి నూనె కాగాక మధ్యస్థ మంటపై ముందుగా చేసి పెట్టుకున్న ముద్దలను కొద్దిగా మందంగా ఉండేలా ఒత్తి నూనెలో వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా వడలు తయారవుతాయి. ఈ విధంగా తయారు చేసిన మసాలా వడలు బయట దొరికే వాటిలా కరకరలాడుతూ ఉంటాయి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. బయట ఈ వడలను తినడం కన్నా ఇంట్లోనే సులభంగా వీటిని తయారు చేసి తినవచ్చు.