MLA Roja : ఏపీలో ప్రస్తుతం పవన్ కల్యాణ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వంగా పరిస్థితులు మారాయి. భీమ్లా నాయక్ విడుదల కావడం.. సినిమా టిక్కెట్ల ధరలపై ఎలాంటి జీవో విడుదల కాకపోవడంతో పవన్ సినిమాను తొక్కేయడానికే ఏపీ ప్రభుత్వం అలా చేస్తుందని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఇక నాగబాబు కూడా ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌ను అన్ని రకాలుగా దెబ్బ తీయడానికే ఏపీ ప్రభుత్వం ఇలా చేస్తుందని ఆయన ఆరోపించారు. అయితే ఈ విషయాలపై వైసీపీ ఎమ్మెల్యే, నటి రోజా స్పందించారు.
పవన్ కల్యాణ్ నష్టపోతున్నాడని అంటున్నారు.. ఆయన ఏమైనా నిర్మాతనా, డిస్ట్రిబ్యూటరా ? అని రోజా ప్రశ్నించారు. కొత్త జీవో వచ్చే వరకు పవన్ తన సినిమాను వాయిదా వేసుకోవచ్చు కదా.. అని అన్నారు. పవన్‌ను తొక్కేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. అల్లు అర్జున్ పుష్ప సినిమా, బాలకృష్ణ అఖండ సినిమా వచ్చినప్పుడు థియేటర్లలో ఏ ధరలు ఉన్నాయో.. ఇప్పుడు కూడా అవే ధరలు ఉన్నాయని అన్నారు. పవన్ కల్యాణ్ కోసం కొత్తగా టిక్కెట్ల ధరలను తగ్గించలేదని.. అవి ఎంతో కాలం నుంచి అలాగే ఉన్నాయని అన్నారు.
టిక్కెట్ల రేట్లను పెంచుకోవాలంటే జాయింట్ కలెక్టర్లకు అప్లై చేసుకోవచ్చు కదా.. అని రోజా అన్నారు. అసలు పవన్ కల్యాణ్‌ను తొక్కేయాలని తాము ఎందుకు చూస్తామని ప్రశ్నించారు. టిక్కెట్ల ధరల విషయం ఒక కొలిక్కి వచ్చే సమయంతో మంత్రి గౌతమ్ రెడ్డి మరణించారని.. దీంతో ఈ విషయంలో కాస్త ఆలస్యం అవుతుందని.. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. అయితే ఇంతలోనే సినిమాను రిలీజ్ చేసుకున్నారని.. కొత్త జీవో వచ్చే వరకు ఆగవచ్చు కదా.. అని రోజా అన్నారు. ఇక పవన్ తన సినిమాను అడ్డం పెట్టుకుని తన పార్టీని నిలబెట్టుకోవాలని చూస్తున్నారని రోజా ఆరోపించారు. ఈ క్రమంలో రోజా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.