Mohan Babu : ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తాజాగా నటించిన చిత్రం.. సన్ ఆఫ్ ఇండియా. ఈ మూవీ ఈనెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సినిమా విడుదల సందర్భంగా మోహన్ బాబు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల పట్ల ప్రస్తుతం ఆయన తనకు ఉన్న అభిప్రాయాన్ని వెల్లడించారు.
రాజకీయాలు రోజు రోజుకీ మరింత దిగజారిపోతున్నాయని మోహన్ బాబు అన్నారు. అప్పట్లో రాజకీయాలు చాలా అద్భుతంగా ఉండేవని, కానీ ఇప్పుడు రాను రాను బురదమయంగా మారిపోయాయని అన్నారు. విలువలు, నైతికత అసలే లేవని అన్నారు. అప్పట్లో చాలా మంది గొప్ప వ్యక్తులు రాజకీయాల్లో ఉండి రాజకీయాలకే వన్నె తెచ్చారని.. కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తులు లేరన్నారు.
ఇక ప్రస్తుతం ఎక్కడో ఒక చోట మంచి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నా.. వారు ఏమీ చేయడం లేదని మోహన్‌బాబు అన్నారు. తన సినిమా సన్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే అందులోనూ రాజకీయాల గురించి చూపించామని తెలిపారు. అందులో అన్యాయంగా జైళ్లలో మగ్గుతున్న వారి గురించి ఉంటుందని అన్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నెలకొన్న పరిణామాలపై అడగ్గా.. అందుకు ఆయన సమాధానం దాటవేశారు.
తాను ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయంపై ఏదైనా మాట్లాడితే వివాదాస్పదం అవుతుందని, అదంతా ఎందుకని అన్నారు. అప్పట్లో ఎన్‌టీఆర్ ఉన్నప్పుడు టీడీపీకి పనిచేశానని.. జగన్ ఇప్పుడు తనకు బంధువు అవుతారు కనుక వైసీపీలో ఉన్నానని తెలిపారు. కానీ రాజకీయాలు అంటే తనకు ప్రస్తుతం ఇష్టం లేదని మోహన్ బాబు తెలిపారు.