Yoga : నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితం. రోజూ ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రించే వరకు.. అనేక సందర్భాల్లో ఒత్తిళ్లు.. దీనికి తోడు సరైన ఆహారం తీసుకోకపోవడం, వేళకు భోజనం చేయకపోవడం.. శారీరక శ్రమ అసలు చేయకపోవడం.. ఇలాంటి అంశాలన్నీ చాలా మందిలో అధిక బరువు సమస్యకు కారణమవుతున్నాయి. దీంతో టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వస్తున్నాయి. అయితే రోజూ వ్యాయామం చేసేంత ఓపిక లేనివారు కనీసం ఈ ఆసనాన్ని అయినా సరే రోజుకు 10 నిమిషాల పాటు వేయాలి. దీంతో ఆయా వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి ఆ ఆసనం ఏమిటంటే..
యోగాలో అనేక రకాల ఆసనాలు ఉన్నాయి. ఒక్కో ఆసనం భిన్న రకాల అనారోగ్యాలను నయం చేయడానికి పనికొస్తుంది. ఇక ఆ ఆసనాల్లో మండూకాసనం కూడా ఒకటి. కప్ప ఎలా ఉంటుందో అలా ఈ ఆసనం వేయాలన్నమాట. దీన్ని ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మండూకాసనం వేసే విధానం..
ముందుగా నేలపై వజ్రాసనం వేసి కూర్చోవాలి. రెండు అరచేతుల పిడికిళ్లను బిగించాలి. వాటిని పొట్ట వద్దకు తెచ్చి ఒక దానితో మరొకదాన్ని పట్టుకోవాలి. అనంతరం పొట్ట దగ్గర పిడికిళ్లను అలాగే పట్టుకుని ఉండి ముందుకు వంగాలి. ఈ భంగిమలో గాలి పీల్చుతూ వీలైనంత సేపు ఉండాలి. తిరిగి యథాస్థితికి రావాలి. ఈ ఆసనాన్ని రోజూ కనీసం 10 నిమిషాల పాటు వేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటంటే..
మండూకాసనం ప్రయోజనాలు..
శరీరంలోని అన్ని అవయవాలకు ఈ ఆసనం ఎంతగానో మేలు చేస్తుంది. అన్ని అవయవాలను పరిపుష్టంగా మారుస్తుంది. మండూకాసనం వేయడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఈ ఆసనం వల్ల అన్ని రకాల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, అజీర్ణం, మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
మండూకాసనం వేయడం వల్ల మోకాళ్లు, మడమలు దృఢంగా మారుతాయి. ఆయా భాగాల్లో ఉండే నొప్పులు పోతాయి. భుజాలు, పొట్ట కండరాలు దృఢంగా మారుతాయి. క్లోమ గ్రంథి, గుండె జబ్బుల సమస్యలతో బాధపడుతున్నవారు ఈ ఆసనం వేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే తొడల వద్ద ఉండే కొవ్వు, పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది.