Mughlai Chicken : మనం చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు చికెన్ తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. చికెన్ తో మనం రకరకాల రుచుల్లో కూరలను తయారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన కూరలల్లో మొగలాయి చికెన్ కర్రీ కూడా ఒకటి. ఈ చికెన్ కర్రీ క్రీమీగా చాలా రుచిగా ఉంటుంది. మనకు రెస్టారెంట్ లలో ఎక్కువగా ఇది లభిస్తుంది. ఎక్కువగా నాన, రోటీలతో దీనిని తింటూ ఉంటారు. ఈ మొగలాయి చికెన్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ మొగలాయి చికెన్ ను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మొగలాయి చికెన్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – పావు కప్పు, నూనె – పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు -తగినంత, జీలకర్ర పొడి – ముప్పావు టీ స్పూన్, ధనియాల పొడి – ముప్పావు టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, అర గంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ – అరకిలో , నీళ్లు – 400 ఎమ్ ఎల్, పుదీనా తరుగు – ఒక టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ – పావు కప్పు, బటర్ – ఒక టేబుల్ స్పూన్.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఫ్రైడ్ ఆనియన్స్ – ముప్పావు కప్పు, జీడిపప్పు – 15, బాదం పప్పు – 15, చిక్కటి మీగడ పెరుగు – అర కప్పు, పచ్చిమిర్చి – 5, లవంగాలు – 4, యాలకులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, బిర్యానీ ఆకు – 1, మిరియాలు – అర టీ స్పూన్.
మొగలాయి చికెన్ కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలన్నీ వేసి తగినన్ని నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి వేయించాలి. తరువాత చికెన్ వేసి 8 నిమిషాల పాటు పెద్ద మంటపై వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిని మధ్యస్థ మంటపై నెయ్యి పైకి తేలే వరకు వేయించాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి చిన్న మంటపై 20 నిమిషాల పాటు ఉడికించాలి.
ఇలా ఉడికించిన తరువాత పుదీనా తరుగు, బటర్, ఫ్రెష్ క్రీమ్ వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మొగలాయి చికెన్ తయారవుతుంది. దీనిని పులావ్, రోటి, చపాతీ, నాన్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ మొగలాయి చికెన్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.