Mushroom Pakora : పుట్ట గొడుగులు.. వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల విటమిన్ డి తో పాటు ఎన్నో విలువైన పోషకాలు మన శరీరానికి అందుతాయి. పుట్ట గొడుగులతో మనం ఎంతో రుచికరమైన వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. కేవలం కూరలే కాకుండా వీటితో మనం పకోడీలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. స్నాక్స్ గా తినడానికి ఈ పకోడీలు చాలా చక్కగా ఉంటాయి. పుట్ట గొడుగులతో రుచిగా పకోడీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మష్రూమ్ పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద ముక్కలుగా తరిగిన పుట్ట గొడుగులు – 2 కప్పులు, శనగపిండి – ఒకటిన్నర కప్పు, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, వంటసోడా – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఉల్లిపాయ తరుగు – పావు కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
మష్రూమ్ పకోడా తయారీ విధానం..
ముందుగా పుట్ట గొడుగులను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో శనగపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, వంటసోడా, కారం, జీలకర్ర, ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తరువాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కొద్దిగా జారుడుగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పుట్ట గొడుగు ముక్కలు వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ పకోడా తయారవుతుంది. వీటిని టమాట సాస్, చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పుట్టగొడుగులతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పకోడీలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.