Mutton Liver Fry : మాంసాహార ప్రియులు ఇష్టంగా తినే వాటిల్లో మటన్ లివర్ కూడా ఒకటి. మటన్ లివర్ లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మటన్ లివర్ తో ఎక్కువగా ఫ్రై, కూర వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. మటన్ లివర్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అలాగే దీనిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే మటన్ లివర్ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్ గా తినడానికి, అన్నం, చపాతీ వంటి వాటితో తినడానికి ఈ ఫ్రై చాలా చక్కగా ఉంటుంది. మరింత రుచిగా, కమ్మగా మటన్ లివర్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ లివర్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
మటన్ లివర్ – అరకిలో, వెల్లుల్లి పాయ – చిన్నది ఒకటి, లవంగాలు – 8, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, అల్లం – ఒక ఇంచు ముక్క, కొబ్బరి – 2 ఇంచుల ముక్క, నూనె – 4 లేదా 5 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మటన్ లివర్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే అల్లం, కొబ్బరి, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక లివర్ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ లివర్ లోని నీరంతా పోయి ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. లివర్ పూర్తిగా వేగి నూనె పైకి తేలిన తరువాత పసుపు, కారం వేసి కలపాలి. తరువాత మూతపెట్టి మరో 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కలపాలి.దీనిపై మూత పెట్టి మరో నిమిషం పాటు వేయించాలి. చివరగా కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ లివర్ ఫ్రై తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ విధంగా తయారు చేసిన మటన్ లివర్ ఫ్రైను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.