Naga Chaitanya : యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య జోరు మీదున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా చైతూ సక్సెస్ బాటలో పయనిస్తున్నాడు. సాయిపల్లవితో కలిసి నటించిన లవ్ స్టోరీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తరువాత తన తండ్రి నాగార్జునతో కలిసి చేసిన బంగార్రాజు కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే నాగచైతన్య త్వరలో మన ముందుకు ఓ అద్భుతమైన హార్రర్, థ్రిల్లర్ సిరీస్‌తో రాబోతున్నాడు.
నాగచైతన్య ప్రధాన పాత్రలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అమెజాన్ ప్రైమ్ ఓ సూపర్‌నాచురల్, హార్రర్ థ్రిల్లర్ సిరీస్‌ను తెరకెక్కించనుందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే తాజాగా చైతన్య ఈ సిరీస్‌పై అప్‌డేట్ ఇచ్చారు. దీంతో ఆయన ఈ సిరీస్‌లో నటిస్తున్నారనే విషయం కన్‌ఫామ్ అయింది. ఈ సిరీస్‌కు దూత అనే టైటిల్‌ను కూడా కన్‌ఫామ్ చేశారు. దెయ్యంతో సంబంధం ఉన్న కథాంశంతో ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారని.. చైతూ పోస్ట్ చేసిన ఫొటోను చూస్తే తెలుస్తోంది. ఈ జోనర్ లో నటించడం ఆయనకు ఇది తొలిసారి కావడం విశేషం. ఇప్పటి వరకు చైతన్య లవ్, రొమాన్స్ చిత్రాల్లోనే ఎక్కువగా నటించారు. అయితే ఇది సినిమా కాకపోయినా.. అంతటి ఉత్కంఠను ఇందులో ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.
ఇక ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్న విక్రమ్ కుమార్ చైతూ తరువాతి సినిమా థాంక్ యూ కు కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అలాగే బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లాల్ సింగ్ చడ్డా అనే సినిమాలోనూ చైతన్య ఓ కీలకపాత్రలో నటించాడు. ఈ మూవీ ఈ వేసవిలో విడుదల కానుంది.