Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం తన సోదరులు పవన్ కల్యాణ్, నాగబాబులకే కాదు.. ఎంతో మందికి ఆయన ఉపాధి చూపించారు. నీడనిచ్చారు. అన్నయ్యా.. అంటూ వెళ్తే ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చిరంజీవి ఎల్లప్పుడూ ముందే ఉంటారు. అయితే బయటి వాళ్లనే ఆయన తన సొంత మనుషుల్లా చూసి సహాయం చేస్తారు. ఇక సొంత ఇంటి సభ్యుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతలా ఆయన తన వాళ్లను చూసుకుంటారు. కానీ తన సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్ మాత్రం ప్రస్తుతం ఆయనను దూరం పెట్టేశారా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఏపీ సీఎంగా జగన్ ప్రమాణం చేశాక ఆయనను చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వాలతో అవసరం ఉంటుంది కనుక ఎవరైనా సరే ఇలా చేయాల్సిందే. ఇక ఈ మధ్య కాలంలో చిరంజీవి టాలీవుడ్ సమస్యలను పరిష్కరించడం కోసం తీవ్రంగా శ్రమించారు. అనేక సార్లు సీఎం జగన్‌ను కలిశారు. దీంతో ఎట్టకేలకు కొత్త జీవోను విడుదల చేశారు. ఏపీలో 20 శాతం షూటింగ్ జరుపుకునే సినిమాలకు టిక్కెట్ల రేట్లను పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ జీవోను జారీ చేశారు. అయితే జగన్‌తో ఇంత సాన్నిహిత్యంగా ఉండడం నాగబాబు, పవన్‌లకు నచ్చడం లేదని తెలుస్తోంది.
2024 ఎన్నికల్లో జనసేనకు వైసీపీయే ప్రత్యర్థి. టీడీపీతో పొత్తు ఉంటుందని అనౌన్స్ చేశారు. కనుక జగన్‌తో తన సోదరుడు సన్నిహితంగా ఉంటే తమకే నష్టం వస్తుందని అనుకున్నారో ఏమో.. తాజాగా జరిగిన సభలో చిరంజీవి మాటనే ఎత్తలేదు. కనీసం ఆయన పేరును కూడా తలచుకోలేదు. తాను రాజకీయాల్లోకి నాగబాబు వల్లే వచ్చానని పవన్ అన్నారు. దీన్ని బట్టి చూస్తే చిరంజీవితో కలసి మెలసి ఉంటే తమ పార్టీకి, రాజకీయాలకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి జగన్‌కు సన్నిహితంగా ఉన్నారు కనుక ఆయనతో దూరంగా ఉంటేనే మంచిదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకనే చిరంజీవిని ఆయన సోదరులు దూరంగా పెట్టేశారని.. నీడనిచ్చి ఆదుకుని ప్రయోజకులను చేసిన అన్నయ్యకే వారు ఇలా చేశారని.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. అయితే దీన్ని కేవలం రాజకీయాలకే పరిమితం చేయాలని.. వ్యక్తిగతంగా ఎవరూ విడిపోవద్దని.. మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.