Nara Disti : మనం సాధారణంగా నర దిష్టి, నర ఘోష వంటి రకరకాల పదాలను వింటూ ఉంటాం. పిల్లలకు, వ్యక్తులకు, వ్యాపారానికి, ఇంటికి నర దిష్టి, నర గోష తగిలింది, అందువల్లనే అనారోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు, ప్రశాంతత లేకపోవడం, వ్యాపారంలో నష్టాలు వంటి సమస్యలు వస్తున్నాయని.. మనలో చాలా మంది భావిస్తారు. ఇది అంతా మూఢ నమ్మకం అనే వారు కూడా ఉన్నారు. అసలు నర దిష్టి, నర ఘోష వంటివి ఉన్నాయా.. అనే సందేహం కూడా చాలా మందికి కలుగుతుంది.
మనిషి దృష్టికి , మాటకు చాలా శక్తి ఉంటుంది కనుక నర దిష్టి, నర ఘోష వంటివి కూడా ఉంటాయని పండితులు చెబుతున్నారు. నరుడి కంటికి నల్ల రాయి కూడా పగులుతుంది అనే సామెత కూడా మనకు చాలా కాలం నుండి వాడుకలో ఉంది. ప్రతి ఒక్కరి చుట్టూ కాంతి వలయం (ఆరా) ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ఇతరులు మనల్ని తదేకంగా లేదా ఎక్కువ సార్లు చూసినప్పుడు ఆ వలయం దెబ్బతింటుంది. అలాగే మన అందరి మనస్తత్వం ఒకేలా ఉండదు. ఇతరులు బాగుండాలి.. అని మనలో చాలా మంది భావించరు. అలాంటి వారు మన గురించి కానీ, మనం చేసే పని గురించి కానీ, వ్యాపారం గురించి కానీ ఎక్కువగా మాట్లాడినప్పుడు వారి మాటల ద్వారా వచ్చే నెగిటివ్ ఎనర్జీ మనలోని పాజిటివ్ ఎనర్జీని దెబ్బతీస్తుందని, అందువల్లనే అనారోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టం, కుటుంబంలో కలహాలు.. వంటి సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు.
నర దిష్టి, నర ఘోషను నివారించే మార్గాలను కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు. పాత కాలం నుండి వస్తున్న పద్దతి ఇది. ఈ పద్దతిని మనలో చాలా మంది అవలంభిస్తారు. పిల్లలకు కానీ, పెద్దలకు కానీ నర దిష్టి తగిలింది అని భావిస్తే రాళ్ల ఉప్పును రెండు చేతుల్లో తీసుకుని కుడి చేత్తో మూడు సార్లు, ఎడమ చేత్తో మూడు సార్లు వారి చుట్టూ తిప్పి నీళ్లలో వేయాలి. ఇలా చేయడం వల్ల మనలోని నెగిటివ్ ఎనర్జీ పోయి, మన చుట్టూ ఉండే కాంతి వలయం మళ్లీ క్రమ పద్దతిలో తిరుగుతుందని, దీని వల్ల సమస్యలు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు.
నర దిష్టి, నర ఘోష తగలకుండా ఉండడానికి మనం ఇళ్లు శుభ్రం చేసేటప్పుడు నీళ్లలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి శుభ్రం చేయాలి. ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి ఇంట్లో ఏ మూలనైనా కదలించకుండా ఉంచాలి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి ఇంట్లో సమస్యలు తగ్గుతాయి. మనం ఎల్లప్పుడూ భగవంతుడి నామాన్ని జపించడం వల్ల లేదా వినడం వల్ల నర ఘోష తగలకుండా ఉంటుంది. వ్యాపారస్థులు వారు పని చేసే చోట ఇతరులకు కనిపించేలా పచ్చటి మెక్కలను, రాళ్ల ఉప్పును గిన్నెలో వేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల నర దిష్టి, నర ఘోష తగ్గి సమస్యలు తగ్గుతాయి.