Nawabi Semai : నవాబి సెమై.. సన్నని సేమ్యాతో చేసుకోదగిన తీపి వంటకాల్లో ఇది కూడా ఒకటి. తియ్యగా, కమ్మగా, చల్ల చల్లగా ఉండే ఈ సెమైను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. మనకు ఎక్కువగా స్వీట్ షాపుల్లో లభిస్తుంది. ఈ నవాబి సెమైను మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తియ్యగా, చల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు, స్పెషల్ డేస్ లో ఇలా నవాబి సెమైను తయారు చేసి తీసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ నవాబి సెమైను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నవాబి సెమై తయారీకి కావల్సిన పదార్థాలు..
సన్నగా పొడవుగా ఉండే సేమ్యా – 200 గ్రా., బాదంపప్పు- 8. జీడిపప్పు – 8, యాలకులు – 4, పంచదార – 3 టేబుల్ స్పూన్స్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, పాలు – అరలీటర్, కస్టర్డ్ పౌడర్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్.
నవాబి సెమై తయారీ విధానం..
ముందుగా పొడుగ్గా ఉండే సేమ్యాను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తరువాత జార్ లో బాదంపప్పు, జీడిపప్పు, యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత పంచదార వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక సేమ్యా వేసి మాడిపోకుండా వేయించాలి. సేమ్యా వేగిన తరువాత ఇందులో మిక్సీ పట్టుకున్న పంచదార పొడితో పాటు సగం జీడిపప్పు, బాదంపప్పు పొడిని వేసి మరో 3 నిమిషాల పాటు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ సేమ్యాను రెండు భాగాలుగా చేసుకుని స్వీట్ తయారు చేసుకునే గిన్నెలోకి ఒక భాగాన్ని తీసుకోవాలి. తరువాత దీనిని పైన సమానంగా చేసుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ కోసం ఒక గిన్నెలో కస్టర్డ్ పౌడర్ ను, మిగిలిన జీడిపప్పు పొడిని తీసుకోవాలి. తరువాత ఇందులో కొద్దిగా పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
తరువాత గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి. పాలు మరిగిన తరువాత ముందుగా తయారు చేసుకున్న కస్టర్డ్ పౌడర్ వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు ఉడికించిన తరువాత పావు కప్పు పంచదార వేసి కలపాలి. ఈ మిశ్రమం చిక్కబడే ఉడికించిన తరువాత తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగా తయారు చేసుకున్న సేమ్యా మీద ఒకటిన్నర ఇంచు మందంతో వేసుకోవాలి. తరువాత దీనిపై మిగిలిన సేమ్యాను వేసుకోవాలి. దీనిని ఎక్కువగా వత్తకుండా నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకుని పైన మరిన్ని డ్రై ఫ్రూట్స్ ను చల్లుకోవాలి. తరువాత దీనిని 2 నుండి 3 గంటల పాటు ఫ్రిజ్ లో చల్లగా అయిన తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నవాబి సెమై తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.