Bellam Avakaya : మనం మామిడికాయలతో వివిధ రకాల ఆవకాయలను తయారు చేస్తూ ఉంటాము. మామిడికాయలతో చేసుకోదగిన రుచికరమైన ఆవకాయ వెరైటీలల్లో బెల్లం ఆవకాయ కూడా ఒకటి. బెల్లం ఆవకాయ తియ్య తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. బెల్లం ఆవకాయను కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. ఈ బెల్లం ఆవకాయను తయారు చేసుకోవడం చాలా సులభం. మొదటిసారి తయారు చేసేవారు కూడా చాలా సులభంగా బెల్లం ఆవకాయను తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ బెల్లం ఆవకాయను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం ఆవకాయ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి మామిడికాయలు – 2( అరకిలో), నూనె – ఒక టేబుల్ స్పూన్, బెల్లం తురుము – 300 గ్రా., బ్లాక్ సాల్ట్ – ముప్పావు టీ స్పూన్, వేయించిన జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్.
బెల్లం ఆవకాయ తయారీ విధానం..
ముందుగా మామిడికాయలను కడిగి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. తరువాత వీటిపై ఉండే చెక్కును తీసేసి తురుముకోవాలి లేదా సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మామిడికాయ తురుము వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత బెల్లం వేసి కలపాలి. దీనిని కలుపుతూ ఉడికించాలి. బెల్లం కరిగి కొద్దిగా చిక్కబడిన తరువాత ఉప్పు, జీలకర్ర పొడి, కారం వేసి కలపాలి. బెల్లం మిశ్రమం ఉడికి తీగపాకం వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం ఆవకాయ తయారవుతుంది. దీనిని చల్లారిన తరువాత గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవడం వల్ల సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన బెల్లం ఆవకాయను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.