Onion Masala Paratha : మనం అల్పాహారంగా తీసుకునే వాటిల్లో పరోటాలు కూడా ఒకటి. గోధుమపిండితో చేసే ఈ పరోటాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మనం మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో ఈ పరోటాలను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన పరోటాలలో ఆనియన్ మసాలా పరోటా కూడా ఒకటి. ఉల్లిపాయలతో చేసే ఈ మసాలా పరోటాలు చాలా రుచిగా ఉంటాయి. కూర, చట్నీ అవసరమే లేకుండా ఈ పరోటాలను నేరుగా అలాగే తినవచ్చు. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ ఆనియన్ మసాలా పరోటాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనియన్ మసాలా పరోటా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – 2 కప్పులు, ఉప్పు – తగినంత, నూనె – 2 టీ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు – 2, కారం – అర టీ స్పూన్, జీలకర్ర పొడి- అర టీ స్పూన్, ధనియాల పొడి -ఒక టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి – అర టీ స్పూన్, గరం మసాలా -అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆనియన్ మసాలా పరోటా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, నూనె వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి పిండిని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని కొద్దిగా రంగు మారే వరకు వేయించిన తరువాత మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పిండిని తీసుకుని చపాతీలా వత్తుకోవాలి.
తరువాత దానిపై ఉల్లిపాయ మిశ్రమాన్ని ఉంచి చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత దీనిని నెమ్మదిగా రోల్ చేసుకుని గుండ్రంగా చుట్టుకోవాలి. తరువాత చపాతీ కర్రతో ఎక్కువ ఒత్తిడి ఇవ్వకుండా నెమ్మదిగా వత్తుకోవాలి. తరువాత ఈ పరోటాను వేడి పెనం మీద వేసి కాల్చుకోవాలి. నూనె వేస్తూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆనియన్ మసాలా పరోటా తయారవుతుంది. దీనిని నేరుగా ఇలాగే తినవచ్చు. లేదంటే పెరుగుతో కూడా తినవచ్చు. ఇలా తయారు చేసిన ఆనియన్ మసాలా పరోటాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.