Apple Banana Smoothie : ఆపిల్ బనానా స్మూతీ.. ఆపిల్ మరియు అరటి పండు కలిపి చేసే ఈ స్మూతీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. చాలా మంది పిల్లలు ఆపిల్ ముక్కలను తినడానికి ఇష్టపడరు. అలాంటి వారికి ఈ స్మూతీని తయారు చేసి ఇవ్వడం వల్ల ఆపిల్ లో మరియు అరటి పండులో ఉండే పోషకాలను వాటి వల్ల కలిగే ప్రయోజనాలను చక్కగా అందించవచ్చు. గర్భిణీ స్త్రీలు, ఆటలు ఆడే వారు, వ్యాయామాలు చేసే వారు, ఎదిగి పిల్లలకు ఈ స్మూతీని ఇవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపిల్ బనానా స్మూతీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన ఆపిల్ – 2, తరిగిన అరటి పండు -ఒకటి, పాలు – ఒక గ్లాస్, తేనె- 2 టీ స్పూన్స్, పంచదార – 3 టీ స్పూన్స్.
ఆపిల్ బనానా స్మూతీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో ఆపిల్ ముక్కలు, అరటి పండు ముక్కలు, పాలు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా 3 నిమిషాల పాటు మిక్సీ పట్టుకున్న తరువాత తేనె, పంచదార వేసి మరో 2 నిమిషాల పాటు మిక్సీ పట్టుకుని గ్లాస్ లోకి పోసుకోవాలి. తరువాత వీటిపై తరిగిన బాదంపప్పు, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆపిల్ బనానా స్మూతీ తయారవుతుంది. స్మూతీ చిక్కగా కావాలంటే పాలను తక్కువగా పోసుకోవాలి. పలుచగా కావాలంటే మరిన్ని పాలను పోసుకోవాలి. చల్లగా కావాలనుకునే వారు ఇందులో ఐస్ క్యూబ్స్ ను కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన స్మూతీని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు. దీనిని తాగడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.