Palakura Pachadi : పాలకూరతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. పాలకూరను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు పాలకూరలో చాలా ఉన్నాయి. అయితే మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వారికి పాలకూరను తక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఈ పాలకూరతో మనం పప్పు, కూర వంటివి ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా పాలకూరతో పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. పాలకూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. పాలకూరతో రుచిగా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకూర పచ్చడి తయారీ విధానం..
తరిగిన పాలకూర – 5 కట్టలు, ఎండుమిర్చి – 20, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, మినపప్పు – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత, కరివేపాకు – పావు కప్పు, ఉప్పు – తగినంత, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 10, నూనె – 3 టేబుల్ స్పూన్స్.
పాలకూర పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి. తరువాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో ధనియాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినపప్పు వేసి దోరగా వేయించాలి. ఇవి వేగిన తరువాత నువ్వులు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడే అదే కళాయిలో మరో టేబుల్ స్పూన్ నూనెను వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తరిగిన పాలకూరను వేసి వేయించాలి. నీరు అంతా పోయి పాలకూర దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక జార్ లో వేయించిన దినుసులతో పాటు ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేయించిన పాలకూర, నానబెట్టిన చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడిచేయాలి.
నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, కచ్చా పచ్చాగా దంచిన వెల్లు్ల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇలా వేయించిన తరువాత ముందుగా తయారు చేసుకున్న పచ్చడిని వేసుకుని కలపాలి. ఈ పచ్చడిని ఐదు నిమిషాల పాటు బాగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని చల్లారిన తరువాత ఒక గాజు సీసాలోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పచ్చడి వారం రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల పాలకూర పచ్చడి తయారవుతుంది. దీనిని వేడివేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పాలకూరతో తరచూ చేసే వంటకాలతో పాటు ఇలా పచ్చడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ పచ్చడిని అందరూ ఇష్టంగా తింటారు. ఈ పచ్చడిని తినడం వల్ల రుచితో పాటు పాలకూరను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా పొందవచ్చు.