Lemon Leaves : మొక్కలు ప్రకృతి మనకు ప్రసాదించిన వరమనే చెప్పవచ్చు. ఇక ఆయుర్వేద మొక్కల గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. వీటిని ఉపయోగించి మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా తగ్గించుకోవచ్చు. అలాంటి ఔషధ మొక్కల్లో నిమ్మ మొక్క కూడా ఒకటి. నిమ్మ చెట్టు, నిమ్మకాయ గురించి తెలియని వారుండరు. నిమ్మరసం మనకు ఎంతో ఉపయోగపడుతుందని దీనిని ఉపయోగించడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని, అందాన్ని మనం సొంతం చేసుకోవచ్చని మనందరికి తెలిసిందే. కేవలం నిమ్మకాయలు మాత్రమే కాదు నిమ్మ చెట్టు ఆకులు కూడా మనకు ఎంతో ఉపయోగపడతాయి.
ఈ విషయం మనలో చాలా మందికి తెలిసి ఉండదు. నిమ్మ ఆకుల్లో కూడా అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. నిమ్మ ఆకుల్లో విటమిన్ బి, సి, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాగే నిమ్మ ఆకుల్లో యాంటీ సెప్టిక్ గుణాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా నిమ్మ ఆకులను విరివిరిగా ఉపయోగిస్తారు. తలనొప్పితో బాధపడుతున్నప్పుడు నిమ్మ ఆకుల వాసనను చూడడం వల్ల తలనొప్పితో పాటు ఒత్తిడి, ఆందోళన, డిఫ్రెషన్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. నిమ్మ చెట్టు ఆకులు మనకు విరివిరిగా లభిస్తాయి. నరాల సంబంధించిన అనారోగ్య సమస్యలు, నిద్రలేమి, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడే వారు నిమ్మ ఆకులను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ నీటిలో శుభ్రంగా కడిగిన పది నిమ్మ ఆకులను వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా తయారు చేయడం వల్ల నిమ్మ ఆకుల టీ తయారవుతుంది. ఈ టీని ఉదయంఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు చొప్పున తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ టీ ని తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య, శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. దగ్గు, జలుబు, గొంతులో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడే వారు ఈ టీ ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కడుపు నొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, జీర్ణ సంబంధిత సమస్యలలతో బాధపడే వారు కూడా నిమ్మ ఆకుల టీ ని తాగి మంచి ఫలితాలను పొందవచ్చు.
ఈ టీ ని తాగడం వల్ల కడుపులో ఉండే క్రిములు నశిస్తాయి. కడుపులో నులిపురుగులను నశింపజేసే గుణం కూడా నిమ్మ ఆకులకు ఉంది. నిమ్మ ఆకుల నుండి తీసిన రసంలో, తేనెను కలిపి తీసుకోవడం వల్ల నులిపురుగులు నశిస్తాయి. ఈ విధంగా చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు ఎవరైనా తీసుకోవచ్చు. అయితే ఈ చిట్కాను 5 నుండి 10 రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించాలి. బరువు తగ్గాలనుకునే వారు నిమ్మ ఆకులతో చేసిన టీ ని తాగడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే ఉబ్బసం సమస్యతో బాధపడే వారు ఈ టీ ని రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. లవంగాలను, నిమ్మ ఆకులను మెత్తగా పేస్ట్ గా చేయాలి. ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న దంతాలపై ఉంచడం వల్ల దంతాల నొప్పి తగ్గుతుంది.
అలాగే నిమ్మ ఆకులను, ఉప్పును, బేకింగ్ సోడాను కలిపి మెత్తగా పేస్ట్ గా చేయాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమంతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా తయారవుతాయి. అలాగే నోటి దుర్వాసన సమస్య కూడా తగ్గుతుంది. అలాగే నిమ్మ ఆకులతో చేసిన టీ ని తాగడం వల్ల అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా నిమ్మ ఆకులు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయని వీటిని వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.