Palakura Pachadi : మనం పాలకూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పాలకూర కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూరతో మనం ఎక్కువగా పప్పు, పాలక్ రైస్, పాలక్ బజ్జీ, కూర వంటి వాటినే తయారు చేస్తూ ఉంటాము. కానీ పాలకూరతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. పాలకూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ పచ్చడిని అందరూ లొట్టలేసుకుంటూ తింటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కమ్మగా, రుచిగా, సులభంగా పాలకూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకూర పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, మెంతులు- చిటికెడు, ధనియాలు – రెండు టీ స్పూన్స్, శనగపప్పు -2 టీ స్పూన్స్, మినపప్పు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 15 లేదా తగినన్ని, కరివేపాకు – పావు కప్పు, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పాలకూర – 3 కట్టలు, చింతపండు – చిన్న నిమ్మకాయంత, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, పసుపు -పావు టీస్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5.
పాలకూర పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మెంతులు,ధనియాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి చక్కగా వేగిన తరువాత నువ్వులు వేసి వేయించాలి. తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. తరువాత అదే కళాయిలో మరో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత తరిగిన పాలకూర, చింతపండు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి పాలకూరను పూర్తిగా మగ్గించాలి.
పాలకూర మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత జార్ లో ముందుగా వేయించిన దినుసులు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత పాలకూర వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పచ్చడి వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలకూర పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా తినవచ్చు. ఈ పచ్చడిని తినడం వల్ల రుచితో పాటు పాలకూర వల్ల కలిగే ప్రయోజనాలను కూడా పొందవచ్చు.