Paneer Jalebi : జిలేబీ.. ఈ పేరు చెప్పగానే సహజంగానే చాలా మందికి నోట్లో నీళ్లూరతాయి. జిలేబీ అంటే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. చక్కెరతో తియ్యగా చేసే ఈ వంటకం మనకు మార్కెట్‌లోనూ చాలా తక్కువ ధరకే లభిస్తుంది. ఎరుపు లేదా పసుపు రంగుల్లో మనకు జిలేబీ అందుబాటులో ఉంటుంది. అయితే జిలేబీ అంటే సహజంగానే మైదా పిండితో చేస్తారు. కానీ పనీర్‌తోనూ మనం జిలేబీని చేసుకుని తినవచ్చు. ఇది సాధారణ జిలేబీలాగే ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. పనీర్‌తో జిలేబీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ జిలేబీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పనీర్ – ఒక కప్పు, మొక్కజొన్న పిండి – పెద్ద టీస్పూన్, మైదా – పెద్ద టీస్పూన్, బేకింగ్ పౌడర్ – అర టీస్పూన్, పాలు – 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – ఒక టీస్పూన్, గులాబీ ఎసెన్స్ – ఒక టీస్పూన్, కుంకుమ పువ్వు రెబ్బలు – కొద్దిగా, ఆరెంజ్ ఫుడ్ కలర్ – చిటికెడు, చక్కెర – ఒక కప్పు, నూనె – వేయించేందుకు సరిపడా.
పనీర్ జిలేబీ తయారీ విధానం..
ముందుగా చక్కెర, అర కప్పు నీళ్లు ఓ గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టాలి. చక్కెర కరిగి తీగం పాకంలా వస్తున్నప్పుడు సగం గులాబీ ఎసెన్స్, కుంకుమ పువ్వు రేకలు, అర టీస్పూన్ నీటిలో కలిపిన ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి కలిపి దింపేయాలి. ఇప్పుడు ఓ గిన్నెలో పనీర్ వేసుకుని పొడిపొడిగా చేసుకుని ఇందులో చక్కెర పాకం, నూనె, పాలు తప్ప మిగిలిన పదార్థాలు వేసుకుని బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి పాలు పోస్తూ చిక్కని దోశ పిండిలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కోన్‌లా చుట్టుకున్న ప్లాస్టిక్ కవర్‌లో వేసుకుని కాగుతున్న నూనెలో జిలేబీల్లా వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. వీటిని చక్కెర పాకంలో వేసి పాకం పట్టిందనుకున్నాక తీసేయాలి. దీంతో ఎంతో రుచికరమైన పనీర్ జిలేబీలు తయారవుతాయి. వీటిని తింటే రుచి అదుర్స్ అంటారు. రెగ్యులర్ జిలేబీలు కాకుండా ఇలా ఒకసారి పనీర్ జిలేబీలను ట్రై చేయండి. రుచిని ఆస్వాదిస్తారు.