Parineeti Chopra : ఈ మధ్య కాలంలో తెలుగులో వస్తున్న అనేక పాన్ ఇండియా సినిమాలు హిట్ అవుతున్నాయి. దీంతో బాలీవుడ్ హీరోయిన్లు తెలుగు చిత్రాల్లో నటించేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఇప్పటికే పలువురు బాలీవుడ్ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటించగా.. త్వరలో మరో బ్యూటీ కూడా తెలుగు తెరకు పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా త్వరలో రామ్‌తో కలిసి ఓ తెలుగు సినిమాలో నటించనున్నట్లు తెలిసింది.
బోయపాటి దర్శకత్వంలో రామ్ హీరోగా శ్రీనివాస చిత్తూరి నిర్మాతగా ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు. రామ్ తొలిసారిగా బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నాడు. అఖండ తరువాత బోయపాటి సినిమాలపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే ఈ కొత్త కాంబినేషన్ హిట్ అవుతుందని అంటున్నారు. ఇక ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మళయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
కాగా ఈ మూవీలోనే రామ్‌తో కలిసి పరిణీతి చోప్రా నటిస్తుందని సమాచారం. ఇప్పటికే ఆమెకు కథను వినిపించగా అందుకు ఆమె ఓకే చేసినట్లు తెలిసింది. రేపో మాపో ఆమె ఈ మూవీకి సైన్ చేస్తుందని తెలుస్తోంది. దీంతో త్వరతో ఆ వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఇప్పటికే ఆలియా భట్, దీపికా పదుకొనె, అనన్య పాండేలు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. దీంతో పరిణీతి ఈ సినిమాను ఓకే చేస్తే ఆమె కూడా ఆ జాబితాలో చేరనుంది.