Peanut Coconut Chutney : మనం ఉదయం అల్పాహారాలల్లోకి రకరకాల చట్నీలను తయారు చేస్తూ ఉంటాము. చట్నీతో తింటేనే ఏ అల్పాహారమైన చాలా రుచిగా ఉంటుంది. ఉదయం పూట మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన చట్నీలల్లో పల్లి కొబ్బరి చట్నీ కూడా ఒకటి. పల్లీలు, కొబ్బరి కలిపి చేసే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, వడ వంటి వాటిలోకి ఈ చట్నీ చాలా చక్కగా ఉంటుదని చెప్పవచ్చు. ఈ చట్నీని చాలా సులభంగా కేవలం 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ పల్లి కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లి కొబ్బరి చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – అర కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు – అర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 6, పుట్నాల పప్పు – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, పచ్చి కొబ్బరి ముక్కలు – 3 టేబుల్ స్పూన్స్ , వెల్లుల్లి రెబ్బలు – 3, చింతపండు – ఒక రెమ్మ, నీళ్లు – తగినన్ని.
పల్లి కొబ్బరి చట్నీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పల్లీలు వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత పుట్నాల పప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తరువాత ఒక జార్ లోకి తీసుకుని ఇందులోనే వేయించిన పల్లీలతో పాటు మిగిలిన పదార్థాలన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ చట్నీని గిన్నెలోకి తీసుకుని తాళింపు వేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పల్లి కొబ్బరి చట్నీ తయారవుతుంది. దీనిని ఏ అల్పాహారంతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. తరచూ ఒకేరకం చట్నీలు కాకుండా ఈ విధంగా మరింత రుచిగా కూడా తయారు చేసుకుని తినవచ్చు.