Perugu Vankaya : వంకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వంకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వంకాయలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వంకాయలతో చేసుకోదగిన రుచికరమైన కూరలల్లో పెరుగు వంకాయ కూర కూడా ఒకటి. పెరుగు వేసి చేసే ఈ వంకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను అందరూ లొట్టలేసుకుంటూ తింటారని చెప్పవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వంకాయలు ఉంటే చాలు ఈ కూరను చాలా త్వరగా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అన్నం, చపాతీతో తిన్నా కూడా ఈ కూర చాలా చక్కగా ఉంటుంది. ఎంతో కమ్మగా, గ్రేవీ ఎక్కువగా ఉండే ఈ పెరుగు వంకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు వంకాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయలు – 2, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు -ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన టమాట – 1, వంకాయలు – పావుకిలో, పసుపు – అర టీ స్పూన్, శనగపిండి – ఒక టీ స్పూన్, పెరుగు – ముప్పావు కప్పు, కారం – ఒక టీ స్పూన్ లేదా తగినంత, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, నీళ్లు – ఒక టీ గ్లాస్, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పెరుగు వంకాయ కూర తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకుని తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కకు ఉంచాలి. తరువాత వంకాయలను నాలుగు పచ్చాలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. తరువాత వంకాయ ముక్కలు, పసుపు వేసి కలపాలి.
ఇప్పుడు వీటిపై మూత పెట్టి వంకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. వంకాయ ముక్కలు వేగిన తరువాత మంటను చిన్నగా చేసి పెరుగు, ముందుగా కలిపిన శనగపిండి వేసి కలపాలి. తరువాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత నీళ్లు, గరం మసాలా వేసి కలపాలి. తరువాత మూత పెట్టి చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. కూర పూర్తిగా ఉడికిన తరువాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెరుగు వంకాయ కూర తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తరచూ వంకాయలతో ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు.