Pesara Kattu : మనం ఆహారంలో భాగంగా తీసుకునే పప్పు దినుసుల్లో పెసరపప్పు కూడా ఒకటి. ఈ పప్పులో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. పెసర పప్పును వాడడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇతర పప్పు దినుసుల కంటే పెసరపప్పు త్వరగా జీర్ణమవుతుంది. దీనిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. పెసర పప్పుతో మనం వివిధ రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా పెసరపప్పుతో పెసరకట్టు ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెసర కట్టు తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసర పప్పు – ఒక కప్పు, నెయ్యి లేదా నూనె – ఒక టేబుల్ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 2, తరిగిన పచ్చి మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, కచ్చా పచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి మిశ్రమం – ఒకటిన్నర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పెసర కట్టు తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పెసరపప్పును వేసి చిన్న మంటపై రంగు మారే వరకు వేయించాలి. తరువాత పెసరపప్పును శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో కానీ కుక్కర్ లో కానీ తీసుకోవాలి. ఈ పెసరపప్పులో నాలుగు కప్పుల నీళ్లు పోసి అర గంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత పెసరపప్పులోని నీటిని పారబోయకుండా మెత్తగా ఉడికించుకోవాలి. పెసరపప్పును మెత్తగా ఉడికించిన తరువాత మరో మూడు కప్పుల నీళ్లు పోసి కలిపి మరిగించాలి. ఇప్పుడు మరో కళాయిలో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి.
తరువాత మినప పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి. తరువాత పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి అన్నీ వేగిన తరువాత ఇంగువను వేసి కలపాలి. తరువాత ముందుగా మరిగించిన పెసరపప్పు మిశ్రమాన్ని వేసి కలపాలి. తరువాత తగినంత ఉప్పు వేసి కలిపి మరో 3 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసర కట్టు తయారవుతుంది. దీనిని వేడి అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా పెసరకట్టును చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.