Pesarapappu Payasam : మనం వంటింట్లో చేసే రకరకాల తీపి పదార్థాలలో పాయసం కూడా ఒకటి. మనం వివిధ రకాల రుచుల్లో ఈ పాయసాన్ని తయారు చేస్తూ ఉంటాం. పెసరపప్పుతో కూడా మనం ఎంతో రుచిగా ఉండే పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. పెసర పప్పు పాయసం రుచిగా ఉండడమే కాకుండా తయారు చేయడం కూడా చాలా సులభమే. పెసరపప్పుతో పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెసరపప్పు పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – ముప్పావు కప్పు, పాలు – రెండున్నర కప్పులు, బెల్లం – ముప్పావు కప్పు, నీళ్లు – రెండున్నర కప్పులు, యాలకుల పొడి – పావు టీ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు – కొద్దిగా, బాదం పప్పు – కొద్దిగా, ఎండు ద్రాక్ష – కొద్దిగా.
పెసరపప్పు పాయసం తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పెసరపప్పును వేసి రంగు మారే వరకు వేయించాలి. తరువాత పెసర పప్పును ఒక కుక్కర్ లోకి తీసుకుని శుభ్రంగా కడిగి రెండు కప్పుల నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. పెసరపప్పును నానబెట్టిన తరువాత కుక్కర్ పై మూత ఉంచి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత అదే కళాయిలో నెయ్యి వేసి నెయ్యి కరిగిన తరువాత జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో బెల్లాన్ని, అర కప్పు నీటిని పోసి బెల్లం కలిగే వరకు తిప్పుతూ ఉండాలి. మరో స్టవ్ మీద గిన్నెను ఉంచి అందులో పాలను పోసి మరిగించాలి. బెల్లం కరిగిన తరువాత అందులో ముందుగా ఉడికించిన పెసరపప్పును వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
ఇలా కలిపిన తరువాత దీనిని 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలను కొద్ది కొద్దిగా పెసర పప్పు మిశ్రమంలో పోస్తూ అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి. తరువాత వేయించిన డ్రై ఫ్రూట్స్ ను వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు పాయసం తయారువుతుంది. తీపి తినాలనిపించినప్పుడు ఈ విధంగా పెసరపప్పుతో చక్కటి పాయసాన్ని చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.