Poha Mixture : అటుకులను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అటుకులతో చేసే ఆహార పదార్థాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. అటుకులతో చేసుకోదగిన వంటకాల్లో మిక్చర్ కూడా ఒకటి. స్వీట్ షాపుల్లో ఈ మిక్చర్ మనకు ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఈ మిక్చర్ ను అదే రుచితో మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. స్వీట్ షాప్ స్టైల్ పోహ మిక్చర్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పోహా మిక్చర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అటుకులు – 4 కప్పులు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, పల్లీలు – ముప్పావు కప్పు, పుట్నాల పప్పు – అర కప్పు, జీడిపప్పు – 12, ఎండు కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, ఎండుద్రాక్ష – 3 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 6, కరివేపాకు – గుప్పెడు, సోంపు గింజలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ధనియాలు – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, పసుపు – ముప్పావు టీ స్పూన్, పంచదార – 2 టీ స్పూన్స్, నువ్వులు – ఒక టీ స్పూన్.
పోహా మిక్చర్ తయారీ విధానం..
ముందుగా అటుకులను జల్లెడలో వేసి జల్లించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత జార్ లో సోంపు గింజలు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, కారం, పసుపు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులోనే పంచదార వేసి మరోసారి మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు చిన్న కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక నువ్వులు వేసి వేయించాలి. నువ్వులు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి నూనెను చల్లారనివ్వాలి. నూనె చల్లారిన తరువాత మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలిపి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో డీప్ ఫ్రైకు సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె మధ్యస్థంగా వేడయ్యాక అందులో జల్లెడను ఉంచాలి. ఈ జల్లెడలో పల్లీలు వేసి వేయించాలి. జల్లెడలో వేసి వేయించడం వల్ల తీయడానికి సులభంగా ఉంటుంది. పల్లీలను వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇదే విధంగా పుట్నాల పప్పు, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, ఎండుద్రాక్ష, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా ఒక్కొక్కటిగా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత నూనెను బాగా వేడి చేసిన తరువాత అదే జల్లెడలో కొద్దిగా అటుకులను వేసి అర నిమిషం పాటు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా అటుకులన్నింటిని వేయించిన తరువాత వీటిలో ముందుగా తయారు చేసుకున్న నువ్వుల మిశ్రమం వేసి చేత్తో అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత వేయించిన పదార్థాలన్నింటిని వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పోహా మిక్చర్ తయారవుతుంది. పిల్లలతో పాటు ఇంట్లో అందరూ దీనిని ఇష్టంగా తింటారు. ప్రయాణాల్లో అలాగే పార్టీలలో స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి.