Semiya Vada : సేమియాతో పాయసమే కాకుండా మనం చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. సేమియాతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అందరూ ఈ వంటకాలను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. తరచూ చేసే వంటకాలతో పాటు ఈ సేమియాతో మనం ఎంతో రుచిగా ఉండే వడలను కూడా తయారు చేసుకోవచ్చు. సేమియాతో చేసే ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి. ఎవరైనా వీటిని చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. స్నాక్స్ గా తినడానికి ఈ వడలు చాలా చక్కగా ఉంటాయి. సేమియాతో రుచిగా వడలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సేమియా వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
సేమియా – ఒక కప్పు, బొంబాయి రవ్వ – ఒక కప్పు, పుల్లటి పెరుగు – అర కప్పు, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తురిమిన క్యారెట్ – 1, ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, జీలకర్ర – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్.
సేమియా వడ తయారీ విధానం..
ముందుగా కళాయిలో సేమియా వేసి చిన్న మంటపై కలుపుతూ వేయించాలి. వీటిని కొద్దిగా రంగు మారే వరకు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదేకళాయిలో రవ్వ కూడా వేసి వేయించి అదే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పెరుగు, మైదాపిండి వేసి కలపాలి. తరువాత పావు కప్పు నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి అర గంట పాటు నాననివ్వాలి. తరువాత అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుని వడల ఆకారంలో వత్తుకోవాలి. తరువాత వాటిపై కొద్దిగా సేమియాతో కోటింగ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వడలను కళాయిలో వేసుకోవాలి.
వీటిని మధ్యస్థ మంటపై అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సేమియా వడలు తయారవుతాయి. ఎక్కువ నూనెను ఉపయోగించకుండా చాలా సులభంగా ఇలా వడలను తయారు చేసుకుని తినవచ్చు. టమాట కిచప్ తో తింటే ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి. సేమియాతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా వడలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.