Prawns Masala Curry : మనం రొయ్యలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. రొయ్యలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. రొయ్యలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రొయ్యల మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. అలాగే వంటరాని వారు, బ్యాచిలర్స్, మొదటి సారి చేసే వారు ఇలా ఎవరైనా చాలా తేలికగా ఈ కర్రీని తయారు చేయవచ్చు. ఎంతో రుచిగా ఉండే రొయ్యల మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రొయ్యల మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
రొయ్యలు – అర కిలో, తరిగిన ఉల్లిపాయ – పెద్దది ఒకటి, తరిగిన టమాట -1, పచ్చిమిర్చి – 4, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 10, నూనె – 3 టేబుల్ స్పూన్స్, సాజీరా – అర టీ స్పూన్, లవంగాలు – 3, యాలకులు – 2, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క, తరిగిన పచ్చిమిర్చి – 2, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – 100 ఎమ్ ఎల్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
రొయ్యల మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత రొయ్యలను ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక రొయ్యలను వేసి వేయించాలి. వీటిని సగానికి పైగా వేయించిన తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత మరో కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి మధ్యస్థ మంటపై రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత రొయ్యలు వేసి కలపాలి.
తరువాత మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మరలా మూతను ఉంచి మరో 4 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రొయ్యల మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. రొయ్యలతో ఈ విధంగా చేసిన మసాలా కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.