Instant Tomato Dosa : మనం అల్పాహారంలో భాగంగా దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. దోశలను చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే మనం మన అభిరుచికి తగినట్టు వివిధ రుచుల్లో ఈ దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మనం సులభంగా తయారు చేసుకునే వెరైటీ దోశలలో టమాట దోశలు కూడా ఒకటి. ఈ దోశలు తయారు చేయడానికి పప్పు నానబెట్టే అవసరమే లేదు. అలాగే పిండిని ముందు రోజే తయారు చేసుకోవాల్సిన పని కూడాలేదు. కేవలం 15 నిమిషాల్లో మనం ఎంతో రుచిగా ఉండే టమాట దోశలను తయారు చేసుకుని తినవచ్చు. ఇన్ స్టాంట్ ఎంతో రుచిగా ఉండే టమాట దోశలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – 4, ఎండుమిర్చి – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టేబుల్ స్పన్, ఉప్పు – తగినంత, బొంబాయి రవ్వ – ఒక కప్పు, గోధుమపిండి – ఒక కప్పు, నీళ్లు – అర కప్పు, వంటసోడా – పావు టీ స్పూన్.
టమాట దోశ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో టమాటాలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత ఇందులోనే ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత అదే జార్ లో బొంబాయి రవ్వ, గోధుమపిండి, వంటసోడా, పావు కప్పు నీళ్లు పోసి మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పిండిని జార్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరో అర కప్పు నీళ్లు పోసి కలపాలి. తరువాత పిండిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. 10 నిమిషాల తరువాత మూత తీసి పిండిని మరోసారి కలుపుకోవాలి. అవసరమైతే మరో పావు కప్పు నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక దానిపై నూనెను రాయాలి. తరువాత పిండిని తీసుకుని దోశలాగా వేసుకోవాలి.
ఈ దోశను చిన్న మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట దోశ తయారవుతుంది. దోశ వేసే ప్రతిసారి పిండిని కలుపుకుంటూ వేసుకోవాలి. ఈ దోశలను టమాట చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. సమయం తక్కువగా ఉన్నప్పుడు, వెరైటీగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు టమాట దోశలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.