Pressure Cooker Egg Biryani : కోడిగుడ్లతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్లతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. కోడిగుడ్లతో మనం చేసుకోదగిన వంటకాల్లో బిర్యానీ కూడా ఒకటి. ఎగ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. బిర్యానీ అనగానే చాలా మంది ఇది శ్రమతో అలాగే సమయంతో కూడుకున్న పని అని భావిస్తారు. కానీ ఎటువంటి శ్రమ లేకుండా చాలా తక్కువ సమయంలో మనం కుక్కర్ లో కూడా ఈ ఎగ్ బిర్యానీని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా కుక్కర్ లో చేసే బిర్యానీ కూడా చాలా రుచిగా ఉంటుంది. సులభంగా, రుచికరంగా కుక్కర్ లో ఎగ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కుక్కర్ లో ఎగ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాస్మతీబియ్యం – రెండు గ్లాసులు, ఉడికించిన కోడిగుడ్లు – 4, నూనె – 4 టేబుల్ స్పూన్స్, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క, అనాస పువ్వులు – 2, బిర్యానీ ఆకులు – 2, లవంగాలు – 4, యాలకులు – 3, జాపత్రి – 1, సాజీరా – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 4, ఫ్రైడ్ ఆనియన్స్ – అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, బిర్యానీ మసాలా – ఒకటిన్నర టీ స్పూన్, తరిగిన టమాటాలు – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, పెరుగు – 4 టీ స్పూన్స్, నీళ్లు – రెండున్నర గ్లాసులు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్.
కుక్కర్ లో ఎగ్ బిర్యానీ తయారీ విధానం..
ముందులో బాస్మతీ బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోయకుండా పక్కకు ఉంచాలి. తరువాత కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలపాలి. తరువాత కోడిగుడ్లకు గాట్లు పెట్టుకుని వేసుకోవాలి. ఈ కోడిగుడ్లను ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఫ్రైడ్ ఆనియన్స్ పావు కప్పు, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. వీటిని మెత్తగా అయ్యే వరకు వేయించిన తరువాత కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. తరువాత చిలికిన పెరుగు వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి.
తరువాత బియ్యం వేసి కలపాలి. ఇప్పుడు వేయించిన కోడిగుడ్లను బియ్యం పైన ఉంచాలి. తరువాత వాటిపై మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని చల్లుకోవాలి. తరువాత వాటిపై నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మధ్యస్థ మంటపై ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత మంటను చిన్నగా చేసి మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కుక్కర్ మూత తీసి కదిలించకుండా మరో 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత అంతా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ బిర్యానీ తయారవుతుంది. దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా కోడిగుడ్లతో చాలా సులభంగా, రుచికరమైన బిర్యానీని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.